![]() |
![]() |

భారతీయ సినీ రంగాన్ని ఏడు దశాబ్దాలకు పైగా తన అసాధారణమైన అభినయంతో ఏలిన మహానటి, పద్మశ్రీ షావుకారు జానకి తుదిశ్వాస విడిచారనే వార్త వినగానే మొత్తం చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ చేదు వార్త తెలిసి నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జానకి గారి మరణం పట్ల ఆయన భావోద్వేగంగా స్పందిస్తూ ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు.
"మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాన్నగారు (ఎన్టీఆర్) హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. " అని గుర్తుచేసుకున్నారు.
అంతేకాదు, నందమూరి కుటుంబానికి చెందిన ఎన్.ఏ.టి. (N.A.T.) బ్యానర్ నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కూడా జానకి కీలక పాత్ర పోషించారు. ఇక మరో ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. "పాండురంగ మహాత్మ్యం నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది." అని బాలకృష్ణ అన్నారు.
మన దేశంలోనే 75 ఏళ్ల సుదీర్ఘమైన నటనా ప్రస్థానాన్ని చూసిన ఏకైక నటి బహుశా షావుకారు జానకి గారు మాత్రమే అయి ఉంటారని బాలయ్య అభిప్రాయపడ్డారు. అంతటి సుదీర్ఘ నటనా జీవితంలో ఎన్నెన్నో మర్చిపోలేని పాత్రలతో కోట్లాది మంది ప్రజల హృదయాలను మెప్పించారని కొనియాడారు.
"ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అంటూ నందమూరి బాలకృష్ణ తన హృదయపూర్వక నివాళులర్పించారు.
Sowcar Janaki, Nandamuri Balakrishna, Shavukaru Janaki
![]() |
![]() |