Home  »  News  »  టాలీవుడ్‌లో ఫోన్ హ్యాకింగ్ కలకలం.. లిస్ట్ ఇదే

Updated : Aug 20, 2026

 

దేనోడు దానికే ఉంటాడనే సామెత రీతిలో ఫోన్ హాకింగ్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు వాళ్ల చూపు టాలీవుడ్ పై పడింది. దీంతో టాలీవుడ్ లో  ఎక్కడ చూసినా ఫోన్ హ్యాకింగ్ విషయమే హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలని టార్గెట్ చేస్తూ ఉంటారు, కానీ ఈ మధ్య వాళ్ళకి కూడా కళాభిమానం ఎక్కువయిందేమో హ్యాకర్లు  తమ రూటు మర్చి  సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోన్లను వరుసగా హ్యాక్ చేస్తుండటం కలకలం రేపుతోంది. 


డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మన నిత్య జీవితంలో ఆర్థిక లావాదేవీల నుండి వ్యక్తిగత సమాచారం వరకు అంతా ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నాం. సైబర్ సెక్యూరిటీ నివేదికల ప్రకారం, ప్రతి 10 స్మార్ట్‌ఫోన్లలో కనీసం 4 ఫోన్లు ఏదో ఒక రకమైన సైబర్ అటాక్ బెదిరింపులను లేదా మాల్‌వేర్ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది. ఈ తరుణంలో టాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్లు వరుసగా హ్యాక్ అవుతున్న ఘటనలు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.  

ఇటీవల జరిగిన ఒక ఘటనలో సినీ పరిశ్రమకు చెందిన ఒకనాటి ప్రముఖ సీనియర్ నిర్మాత ఫోన్ హ్యాకింగ్‌కు గురైంది. హ్యాకర్లు ఆయన ఫేస్‌బుక్ ఖాతాతో పాటు వాట్సాప్, కాంటాక్ట్ లిస్ట్‌ను ఉపయోగించుకుని  మోసానికి తెరలేపారు. ఆ నిర్మాత సీనియర్ కావడంతో ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆయన ఖాతాల నుండి వరుసగా మెసేజ్‌లు వెళ్లాయి. ఆ మెసేజ్‌లలో ఒక ఏపీకే (APK) ఫైల్ లింక్ ఉంచి, దాన్ని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. అనుమానం రాని కొందరు ఆ లింక్ క్లిక్ చేయడంతో, వారి ఫోన్లు కూడా మాల్‌వేర్ బారినపడి హ్యాక్ అయినట్లు తెలిసింది. అంతేకాకుండా, ఆ నిర్మాత ఫోన్‌లోని కాంటాక్ట్స్‌కి భారతీయ నంబర్లతో కాకుండా విదేశీ కంట్రీ కోడ్‌లు కలిగిన అనుమానాస్పద నంబర్ల నుండి వింతైన మెసేజ్‌లు కూడా వెళ్లడం గమనార్హం.  ఈ ఘటన మరవక ముందే, టాలీవుడ్‌కి చెందిన మరో ప్రముఖ సీనియర్ ఫోటోగ్రాఫర్ ఫోన్ కూడా సరిగ్గా ఇదే పద్ధతిలో హ్యాకింగ్‌కు గురైంది. ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్‌లోని సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని  హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుని, ఆయనకు తెలిసిన వ్యక్తులకు హానికరమైన డౌన్‌లోడ్ లింక్‌లను పంపడం మొదలుపెట్టారు. 


Also Read: ఓటిటిలోకి సుస్మిత కొణిదెల మూవీ.. ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ మ్యూజిక్ డ్రామా! 


ఇలా ఒకరి తర్వాత ఒకరిగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ రకమైన దాడులు కేవలం డేటా చోరీకే కాకుండా, సెలబ్రిటీల పేరిట డబ్బులు వసూలు చేయడానికి లేదా వారి వ్యక్తిగత ఫోటోలు, చాట్‌లను విశ్లేషించి బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా దారితీసే ప్రమాదముంది.  ఈ నేపథ్యంలో సైబర్ నిపుణులు అందరికీ కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తుల నుండే కాకుండా, తెలిసిన వారి నుండి వచ్చినప్పటికీ అనుమానాస్పద APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ఏవైనా యాప్‌లు కావాలనుకుంటే కేవలం అధికారిక గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫోన్లలో నిరంతరం సెక్యూరిటీ అప్‌డేట్లు చేసుకోవడం, పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఆన్ చేసుకోవడం వల్ల ఇలాంటి హ్యాకింగ్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీ ఫోన్ కూడా వింతగా ప్రవర్తిస్తున్నా లేదా అనుమతి లేని యాప్‌లు కనిపిస్తున్నా వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. 



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.