Home  »  News  »  బోనాల ఉత్సవాల్లో ట్రోలింగ్ దుమారం..  క‌న్నీళ్లు పెట్టుకున్న‌ ఫరియా అబ్దుల్లా!

Updated : Aug 17, 2026

యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ సంస్కృతిలో ఎంతో విశిష్టమైన బోనాల పండుగ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె, ఆ తర్వాత ఎదురైన నెగెటివిటీని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని, మనోవేదనను వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుదీర్ఘ వీడియో ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ ఆలం మండిలో వెలసిన శ్రీ మహాకాళేశ్వర అమ్మవారి బోనాల ఉత్సవాలకు ఫరియా హాజరయ్యారు. అక్కడ పక్కా తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించి, పసిడి బోనాన్ని నెత్తిన ఎత్తుకుని డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఆమె చేసిన డ్యాన్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లోకల్ కల్చర్‌పై తనకున్న మమకారాన్ని చాటుకుంటూ ఎంతో ఆనందంగా ఈ వేడుకల్లో భాగమైన ఆమెకు, ఆ వెంటనే సోషల్ మీడియాలో ఊహించని రీతిలో ట్రోలింగ్ ఎదురైంది.

ముస్లిం నేపథ్యం ఉన్న ఫరియా హిందూ సంప్రదాయంలో జరిగే పూజల్లో ఎలా పాల్గొంటారంటూ కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. అంతేకాకుండా తీవ్రంగా వ్యక్తిగత దూషణలకు దిగుతూ, మత విశ్వాసాల పేరుతో కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఫరియా ఓ వీడియో ద్వారా స్పందిస్తూ తన ఆవేదనను వెళ్లగక్కారు. తన కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది.

"మా నాన్న సంజయ్ అబ్దుల్లా పుట్టుకతో హిందువే, కానీ ఇస్లాం సిద్ధాంతాలు నచ్చి ఆ మతాన్ని స్వీకరించారు. మతాన్ని మనస్ఫూర్తిగా గౌరవించి ఆచరించే తండ్రి పెెంపకంలో పెరిగిన నాకు సమాజంలో మంచి విషయాలే కనిపించాయి. నేను ప్రకృతిలోని ప్రతి రూపాన్ని, ప్రతి జీవిని దైవంగా భావిస్తాను. నన్ను ద్వేషించే వారికి కూడా మంచి జరగాలనే ఆశిస్తాను. ద్వేషాన్ని కేవలం ప్రేమతోనే ఎదుర్కొంటాను" అని ఫరియా స్పష్టం చేశారు. ప్రేమను వ్యక్తపరిచే స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.

'జాతి రత్నాలు' సినిమాతో చిట్టి పాత్రలో కనిపించి తొలి చిత్రంతోనే విశేష ఆదరణ దక్కించుకున్న ఫరియా, అనతికాలంలోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత 'బంగార్రాజు', 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్', 'రావణాసుర' వంటి వరుస చిత్రాల్లో నటించి తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా మంచి డ్యాన్సర్‌గా, కళలపై విపరీతమైన ప్రేమ ఉన్న నటిగా ఆమె టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు.

ప్రస్తుతం ఈ అంశంపై సినీ పరిశ్రమ నుంచి, సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మంచు లక్ష్మితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఫరియాకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడమే తప్ప మతాన్ని ముడిపెట్టి నిందించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.

 

Faria Abdullah, Faria Abdullah Bonalu Festival, Jathi Ratnalu Actress Faria, Faria Abdullah Emotional Video, Tollywood Latest Gossip Telugu






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.