Home  »  News  »  మహేశ్ బాబు బర్త్‌డే స్పెషల్.. ‘వారణాసి’ నుంచి పవర్‌ఫుల్ ‘రుద్ర’ ఫస్ట్ లుక్ రివీల్!

Updated : Aug 9, 2026

సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గ్రాండ్ సర్ ప్రైజ్ లభించింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'వారణాసి' నుంచి మహేశ్ బాబు ఫస్ట్ లుక్ పిక్స్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ఈ బిగ్ పిక్చర్‌లో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే అత్యంత వైవిధ్యమైన శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లలో మహేశ్ లుక్ సరికొత్తగా ఆకట్టుకుంటోంది. ఒక వైపు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా వెదురు తెప్పపై తేలియాడుతూ కనిపిస్తే.. మరో పిక్‌లో ఆఫ్రికా దట్టమైన అడవుల్లో గంభీరంగా నిలబడి ఉన్న దృశ్యాలు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ.. 'రుద్ర' కేవలం తీవ్రత కలిగిన పాత్ర మాత్రమే కాదని, సున్నితత్వం, సమయస్ఫూర్తి కలగలిసిన అరుదైన క్యారెక్టర్ అని కొనియాడారు. ఈ పాత్రకి మహేశ్ తన నటనతో ప్రాణం పోశారని పేర్కొన్నారు. అలాగే ఆఫ్రికాలోని కిలిమంజారో, మసాయ్ మారా వంటి అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ జరపడం మరపురాని అనుభూతిని ఇచ్చిందని జక్కన్న తెలిపారు.

ఈ గ్లోబల్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కంచి అందించిన ఈ కథలో ఒక భారీ గ్రహశకలం వారణాసి నగరం వైపు దూసుకొచ్చే కథాంశంతో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ మిళితం చేసి రూపుదిద్దుతున్నట్లు తెలుస్తోంది. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మహేశ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ఈ పోస్టర్లు ఆన్‌లైన్‌లో క్షణాల్లో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో 'రుద్ర' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, సినీ విశ్లేషకులు, అభిమానులు మహేశ్ మేకోవర్‌ను విశేషంగా ప్రశంసిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని టాక్. ప్రధాన యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ పూర్తవ్వగా, ప్రస్తుతం చివరి దశ షెడ్యూల్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలు, టీజర్ అప్‌డేట్స్‌ను వెల్లడించేందుకు చిత్రబృందం సమాయత్తమవుతోంది.

 

Mahesh Babu, SS Rajamouli, Varanasi Movie First Look, Rudra Mahesh Babu, SSMB29 Movie Update






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.