Home  »  News  »  ఓటీటీ కంపెనీల టార్చర్..  వాళ్ళ బతుకు బస్టాండ్ పాలేనా!

Updated : Aug 3, 2026

 

ఎవరి గొయ్యి వాళ్లే తవ్వుకుంటారు. కాకపోతే మనం చూస్తూ ఉండాలనే సామెత ఇప్పుడు ఓటిటి నిర్వాహకులకి సరిగ్గా సరిపోతుంది. యాదృచ్చితంగా మొదలు పెట్టిన  ఆ అలవాటుకి ఓటిటి నిర్వాహుకులు బానిసలుగా మారారా లేక మారబోతున్నారా అనే చర్చ కూడా ఓటిటి మూవీ లవర్స్ లో మొదలైంది.  

 ఒకప్పుడు ఓటీటీ అంటే టీవీల లాగా ప్రకటనల గోల లేకుండా, ఎలాంటి అంతరాయం లేకుండా నచ్చిన సినిమాని  లేదా వెబ్ సిరీస్‌ ప్రశాంతంగా ఆస్వాదించే ఒక అద్భుతమైన వేదికగా ఉండేది. కానీ  సబ్‌స్క్రిప్షన్ పేరిట వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్న ఓటీటీ సంస్థలు, ఇప్పుడు ప్రకటనల పేరుతో వీక్షకుల సహనానికి దారుణమైన పరీక్ష పెడుతున్నాయి. ఈ పరిస్థితిపై ప్రస్తుతం సగటు డిజిటల్ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా కొన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో యాడ్స్ వేసే తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అసలు మనం సినిమా మధ్యలో యాడ్స్ చూస్తున్నామా లేక యాడ్స్ మధ్యలో సినిమా చూస్తున్నామా అనే అనుమానం కలుగుతోందని వీక్షకులు మండిపడుతున్నారు. ఉదాహరణకు జియో హాట్‌స్టార్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రతి 5 నిమిషాలకు కనీసం 2 నుండి 3 వరుస ప్రకటనలు గుప్పిస్తూ వీక్షకుల మూడ్‌ని  పాడుచేస్తున్నాయి. ఒక సినిమా చూసేటప్పుడు ఏదైనా ఆసక్తికరమైన సస్పెన్స్ థ్రిల్లర్ సీన్ లేదా భావోద్వేగ సన్నివేశం పీక్స్‌లో ఉన్నప్పుడు, సడన్‌గా ప్రకటనలు రావడం వీక్షకుల ఉత్సాహాన్ని నీరుగారుస్తోంది. నెలవారీ, వార్షిక చందాల పేరిట భారీగా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేసిన తర్వాత కూడా ఇలాంటి డిజిటల్ టార్చర్ ఏంటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

కేవలం ప్రకటనల సంఖ్య మాత్రమే కాకుండా, అందులో వస్తున్న కంటెంట్ కూడా తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ఇంట్లో పిల్లలు, పెద్దలతో కలిసి కుటుంబ సమేతంగా హాల్లో కూర్చొని సినిమా చూద్దామని హాట్‌స్టార్ ఆన్ చేస్తే చాలు, ఊహించని విధంగా పాన్ మసాలా లేదా కండోమ్ ప్రకటనలు ప్రత్యక్షమవుతున్నాయి. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న బోల్డ్ సినిమాలు, అశ్లీల వెబ్ సిరీస్‌ల క్లిప్పింగ్స్‌ను యాడ్స్ రూపంలో పదే పదే ప్రదర్శిస్తున్నారు. పక్కనే ఉన్న చిన్న పిల్లలు ఆ యాడ్‌ని చూసి 'అది ఏం సినిమా?' అని అడిగితే తల్లిదండ్రులు ఏం చెప్పాలో తెలియక తెల్లముఖం వేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పిల్లల ముందే ఇలాంటి అసభ్యకరమైన ప్రకటనలు రావడం వల్ల కుటుంబంతో కలిసి డిజిటల్ కంటెంట్ చూడటమే భయంగా మారిందని ప్రేక్షకులు వాపోతున్నారు.


Also read: విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. అసలు నిజం ఇదే! 


ఓటీటీ సంస్థల ఈ ధోరణి వల్ల చాలామంది వీక్షకులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌లు సబ్‌స్క్రైబర్ల సమయానికి, వారు చెల్లించే డబ్బుకు కొంతవరకు విలువనిస్తూ యాడ్స్ గోలను నియంత్రిస్తున్నాయని భావిస్తున్నారు. కానీ వినియోగదారుల సహనాన్ని పరీక్షించే ప్లాట్‌ఫామ్‌ల కంటే పాతకాలపు ఉచిత టీవీ ఛానెళ్లు లేదా యూట్యూబ్ బెటర్ అని చాలామంది నిట్టూరుస్తున్నారు. పెట్టిన డబ్బులకు తగిన విలువ ఇవ్వకుండా, ప్రతి 5 నిమిషాలకు 2-3 యాడ్స్‌తో వేధించే ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. వినియోగదారుల అసంతృప్తిని గుర్తించి ఓటీటీ సంస్థలు ఇప్పటికైనా ప్రకటనల మోతాదును తగ్గించకపోతే, ఓటిటి నిర్వాహకులకి మంచి జరగడం అనేది జరగని పని.   ఎందుకంటే అక్కడ ఉంది ప్రేక్షక దేవుళ్ళు.

Ott Movies, Tollywood

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.