![]() |
![]() |

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా తెరకెక్కే ప్రతి దృశ్యకావ్యంపై ప్రేక్షకుల్లో అపారమైన ఆసక్తి ఉంటుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ ట్రైలర్‌లో రాముడిగా రణ్‌బీర్ కపూర్ ప్రశాంతత, సీతగా సాయి పల్లవి అమాయకత్వం, రావణాసురుడిగా యశ్ గంభీరత సోషల్ మీడియాలో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి.
అయితే ఈ రామాయణ ట్రైలర్ ఎంత గొప్పగా ఆకట్టుకుందో, అదే స్థాయిలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమాను మరోసారి నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపొందిన ఆదిపురుష్ చిత్రం 2023లో విడుదలైనప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు నితీష్ తివారీ రామాయణ ట్రైలర్‌లో విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల రూపురేఖలు, ప్రాచీన సంస్కృతికి ఇచ్చిన గౌరవాన్ని చూసిన సినీ ప్రియులు, ఆదిపురుష్‌ను పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా లంకేశ్వరుడి పాత్ర డిజైన్‌లో రెండు సినిమాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమాలో సైఫ్ ఆలీ ఖాన్ పోషించిన రావణాసురుడి లుక్ ఒక ఆధునిక విలన్‌లా ఉందనే విమర్శలు వచ్చాయి. పైగా అందులో రావణుడి వాహనం, రావణ లంక రంగులు రామాయణ ఇతిహాసానికి తగినట్లుగా లేవని అప్పట్లో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కానీ ప్రస్తుత రామాయణం ట్రైలర్‌లో యష్ రావణాసురుడిగా కనిపించిన తీరు, బంగారు లంకా నగరం ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబించేలా ఉందని అభిమానులు కొనియాడుతున్నారు. అలాగే రామాయణ ట్రైలర్ లో వీఎఫ్ఎక్స్ చూశాక ఆదిపురుష్ క్వాలిటీ ఎంత పేలవంగా ఉందో అర్థమవుతోందని ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు.
ఒకే ఇతిహాసాన్ని ఇద్దరు దర్శకులు ఏ విధంగా ఊహించుకున్నారో తేడా చూపిస్తూ నెటిజన్లు వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా రామాయణం ట్రైలర్ ఒకవైపు యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తుంటే, మరొకవైపు ఆదిపురుష్ చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ట్రెండ్ అవ్వడం విశేషం.
Ranbir Kapoor, Ramayana Trailer, Prabhas, Adipurush
![]() |
![]() |