![]() |
![]() |
తెలుగు చిత్రసీమలో ఒక విలక్షణమైన కథతో సంచలనం సృష్టించిన 'బలగం' సినిమా గుర్తుంది కదా? ఆ అద్భుత విజయం తర్వాత దర్శకుడు వేణు యెల్దండి తన తదుపరి ప్రాజెక్ట్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లోనే పట్టాలెక్కించారు. అదే 'ఎల్లమ్మ'. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలో లీడ్ రోల్ ఎవరు చేస్తారనే విషయంపై టాలీవుడ్‌లో గత ఆరు నెలలుగా పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. మొదట్లో ఈ ప్రాజెక్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తాడని అందరూ భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత యంగ్ హీరో నితిన్‌తో షూటింగ్ ప్రారంభం ఖాయమని ప్రచారం జరిగినా, చివరకు ఆ కాంబినేషన్ కూడా సెట్ కాలేదు.
ఎట్టకేలకు ఈ భారీ సస్పెన్స్‌కు తెర దించుతూ 'ఎల్లమ్మ' సినిమాతో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తున్నట్లు దిల్ రాజు అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ నటుడిగా, అది కూడా లీడ్ రోల్‌లో కనిపించబోతుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే హీరో సస్పెన్స్ వీడినా, ఇప్పుడు అంతకు మించిన కొత్త సస్పెన్స్ టాలీవుడ్‌లో మొదలైంది. అదే 'ఎల్లమ్మ' చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు? దేవి శ్రీ వంటి సీనియర్ టెక్నీషియన్‌కు జోడీగా నటించాలంటే కాస్త మెచ్యూరిటీ, మినిమం ఏజ్ ఉన్న భామ కావాలనేది చిత్ర యూనిట్ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ రేసులో నెటిజన్లు, సినీ ప్రియులు ఎక్కువగా సౌత్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి పేరును బలంగా వినిపించారు. గతంలో దిల్ రాజు బ్యానర్‌లో 'ఫిదా', 'MCA' వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన సాయి పల్లవి అయితే ఈ వైవిధ్యమైన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ తాజా ఫిలిం నగర్ సమాచారం ప్రకారం సాయి పల్లవి వైపు మేకర్స్ అసలు ప్రయత్నాలే చేయలేదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం సాయి పల్లవి డిమాండ్ చేస్తున్న పారితోషికం చాలా ఎక్కువ. ఆమెను తీసుకుంటే బడ్జెట్ పరిమితులు దాటిపోతాయని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. అందుకే సాయి పల్లవిని పక్కన పెట్టి, కేవలం కోటి రూపాయల లోపు పారితోషికం తీసుకునే హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు.
ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం చూస్తే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగాయని, దాదాపు ఆమెనే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ టాక్. రుక్మిణితో పాటు సమంత, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినా, కోటి రూపాయల లోపు బడ్జెట్ సమీకరణాలు రుక్మిణి వసంత్‌కే ఎక్కువగా అనుకూలిస్తున్నాయి. దర్శకుడు వేణు యెల్దండి ఇప్పటికే నటీనటుల ఎంపికను పూర్తి చేశారని, హీరోయిన్ విషయంలో కావాలనే సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. హీరో విషయంలో ఆరు నెలలు ఊరించిన మేకర్స్, ఇప్పుడు హీరోయిన్ విషయంలోనూ అదే తంతు కొనసాగిస్తుండటంతో "బాబోయ్ ఎల్లమ్మ.. ఇంత సస్పెన్స్ అవసరమా?" అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దిల్ రాజు, వేణు కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్ హీరోయిన్‌ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి!
Yellamma, DeviSri Prasad, Dil Raju, Venu Yeldandi, Sai Pallavi, Rukmini Vasanth
![]() |
![]() |