Home  »  News  »  'లెనిన్'లో ట్విస్ట్‌లు ఎవరూ ఊహించలేరు.. అఖిల్ బ్లాక్‌బస్టర్ కొడుతున్నాడు.!

Updated : Jul 5, 2026

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin). ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక తిరుపతి వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ అక్కినేని నాగార్జున వేదికపై చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. ముందుగా కొండపై ఉన్న వేంకటేశ్వర స్వామికి, ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు తెలియజేస్తూ నాగార్జున తన ప్రసంగాన్ని ఎంతో ఎమోషనల్‌గా ప్రారంభించారు. ఈ సినిమా కథ తన వద్దకు వచ్చినప్పటి నుండి, సినిమా చూసే వరకు తనకు కలిగిన అనుభూతులను ఆయన పంచుకున్నారు.

డైరెక్టర్ మురళీ కిషోర్ (నందు) మొదట ఈ కథ చెప్పడానికి తన వద్దకు వచ్చినప్పుడు, ఇది 'శ్రీరామాపురం' నేపథ్యంలో జరిగే కథ అని చెప్పగానే తనకు ఒక తెలియని సెంటిమెంట్ కనెక్ట్ అయిందని నాగార్జున వెల్లడించారు. ఎందుకంటే శ్రీరామాపురం అనేది అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టిన ఊరి పేరు అన్నారు. అందుకే ఆ పేరు వినగానే కథ వినాలనే కుతూహలం పెరిగిందని చెప్పారు. అలా నందు కథ చెప్పడం ప్రారంభించాక, అందులోని క్యారెక్టరైజేషన్స్, విభిన్నమైన ఎమోషన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని నాగార్జున ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రపంచంలో ప్రేమను మించిన పెద్ద ఎమోషన్ లేదని, ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయని, యుద్ధాలు జరిగాయని చెబుతూ, ఈ 'లెనిన్' చిత్రంలో కూడా ఒక అద్భుతమైన ప్రేమకథ ఉందని నాగార్జున పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ (భారతి) నటనను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. భారతి పాత్ర కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చనేంతగా ఆమె అద్భుతంగా నటించిందని, ఆమె ఈ సినిమాకు హార్ట్ బీట్ లాంటిదని కొనియాడారు. అలాగే తనతో ఎప్పటి నుంచో జర్నీ ఉన్న శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ వంటి నటీనటులు ఈ సినిమాలో భాగం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, వీరంతా సినిమాపై ఉన్న ప్రేమతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని అభినందించారు.

చిత్ర నిర్మాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గురించి మాట్లాడుతూ.. మీరు చింటూ అన్న అని పిలుస్తారు కదా అంటూ ఫ్యాన్స్ లో జోష్ పెంచారు. నాగవంశీకి మాస్ పల్స్ ఏంటో బాగా తెలుసని ప్రశంసించారు. నాగవంశీకి ఈ సినిమాపై ఎంతటి గట్టి నమ్మకం ఉందంటే, ఆంధ్రప్రదేశ్ టోటల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆయనే చూసుకుంటున్నారని నాగార్జున అన్నారు.

చివరగా తన కుమారుడు అఖిల్ అక్కినేని గురించి నాగార్జున మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అఖిల్ ఇప్పటివరకు అన్ని అర్బన్ క్లాస్ సినిమాలు చేశాడని, ఈ సీమ మట్టి కథలో, సీమ మనుషుల నేపథ్యంలో జరిగే రా అండ్ రస్టిక్ పాత్రకు అతను సెట్ అవుతాడా లేదా అని మొదట్లో తనకు చాలా పెద్ద భయం ఉండేదని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఇది సీమలో జరిగే ఒక 'మహాభారతం' లాంటి కథ అని అభివర్ణించారు. కానీ సినిమా చూసిన తర్వాత తాను మాత్రమే కాదు, అందరూ ఆశ్చర్యపోయేలా అఖిల్ అద్భుతంగా నటించాడని గర్వంగా చెప్పారు. స్క్రీన్ మీద మీకు అఖిల్ కనిపించడని, కేవలం 'లెనిన్' మాత్రమే కనిపిస్తాడని అన్నారు. థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులు లెనిన్ స్నేహాన్ని, అతని ప్రేమను, అతని పగను గుండెలకు హత్తుకుని ఇంటికి తీసుకెళ్తారని భరోసా ఇచ్చారు. తన తండ్రి ఏఎన్నార్ ఎప్పుడూ చెప్పే 'ప్రేక్షక దేవుళ్ల' ఆశీస్సులు తమకు ఉంటాయని నమ్ముతూ, "జూలై 10న వస్తున్నాం... మనవాడు గట్టిగా కొడుతున్నాడు" అంటూ నాగార్జున హై వోల్టేజ్ స్పీచ్‌తో అభిమానుల్లో పూనకాలు తెప్పించారు.

 

 

Akhil Akkineni, Lenin Event, Tirupati, Nagarjuna Speech, TeluguOne

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.