Home  »  News  »  Lenin Trailer: అఖిల్ 'లెనిన్' ట్రైలర్ రెస్పాన్స్.. అక్కినేని ఫ్యాన్స్ ఆకలి తీరేనా?

Updated : Jul 1, 2026

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నుంచి సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. 'ఏజెంట్' భారీ పరాజయం తర్వాత అఖిల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి కసితో సిద్ధమయ్యాడు. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ సరికొత్త ఊర మాస్ అవతారంలో నటిస్తున్న చిత్రం 'లెనిన్' (Lenin). అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా జూలై 10న థియేటర్లలోకి రాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వైజాగ్ వేదికగా నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో 'లెనిన్' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, యూట్యూబ్‌లో లక్షలాది వ్యూస్ తో దూసుకుపోతోంది. అక్కినేని అభిమానుల ఆకలి తీర్చేలా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

సుమారు 3 నిమిషాల 10 సెకన్ల నిడివి ఉన్న ఈ 'లెనిన్' ట్రైలర్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభం కావడం విశేషం. "ఇది మహాభారతం.. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మను కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక్క నిబంధన.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చిందకూడదు." అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, గ్రామీణ రాజకీయాలు, వర్గ పోరాటాలు మరియు కక్షల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిందని స్పష్టమవుతోంది. అఖిల్ లుక్, మేకోవర్ ఈ ట్రైలర్‌లో మేజర్ హైలైట్‌గా నిలిచాయి. క్లాస్ లుక్ నుంచి కంప్లీట్ రగ్గడ్ మరియు ఇంటెన్స్ మాస్ అవతారంలో అఖిల్ కనిపించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. లవ్ స్టోరీతో మొదలైన హీరో ప్రయాణం, ఊహించని పరిస్థితుల వల్ల ఒక భారీ యుద్ధంగా ఎలా మారింది అనే కోణంలో యాక్షన్ సీక్వెన్స్‌లను అద్భుతంగా డిజైన్ చేశారు.

ఈ సినిమాలో అఖిల్ సరసన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ట్రైలర్‌లో ఆమె లుక్స్, అఖిల్‌తో కెమిస్ట్రీ మరియు ఎమోషనల్ సీన్లు కంటికి ఇంపుగా ఉన్నాయి. వీరికి తోడుగా శివాజీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, ఈశ్వరి రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రాణంగా నిలిచింది. ఒకవైపు పల్లెటూరి జానపద బాణీలు వినిపిస్తూనే, యాక్షన్ సీన్లలో థమన్ తన మార్క్ రఫ్పాడించే ఆర్ఆర్ తో గూస్‌బంప్స్ తెప్పించాడు. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ విజువల్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చాయి. మొత్తానికి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అఖిల్ ఎమోషనల్ అవుతూ.. మూడేళ్లుగా సినిమా రానందుకు ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు. "ఈసారి నేను మాట్లాడను, జూలై 10న నా సినిమా మాట్లాడుతుంది, గుండె మీద చేయి వేసి చెప్తున్నా నమ్మండి బ్రదర్" అంటూ అఖిల్ చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈసారి అయ్యగారు గట్టిగానే కొట్టేలా ఉన్నారంటూ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మరి 'లెనిన్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.