Home  »  News  »  Gossip Review Telugu: రాశి సింగ్ 'గాసిప్' మూవీ రివ్యూ

Updated : Jun 27, 2026

యంగ్ హీరోయిన్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'గాసిప్'. వైభవ్ కౌండిన్య రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యతి నిర్మించారు. మహేష్ యడ్లవల్లి హీరోగా నటించగా.. విజయ్ ఆదిరాజు, రవి వర్మ, గురు చరణ్, 30 ఇయర్స్ పృథ్వీ ఇతర కీలక పాత్రలు పోషించారు. జూన్ 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? (Gossip Movie Review)

కథ: 
తల్లి లేని అజంత (రాశి సింగ్)ను తండ్రి రమేష్ (విజయ్ ఆదిరాజు) ఎంతో గారాబంగా పెంచుతాడు. చదువు పూర్తైన తర్వాత స్నేహితులతో సరదాగా డైలీ టైమ్ స్పెండ్ చేయడం ఆమెకు అలవాటు. వీణ వాయిస్తుంది. అందులో ఉన్నత స్థాయికి వెళ్ళాలనేది ఆమె కల. అయితే, పనిపాట లేని కొందరు వ్యక్తులు టీ కొట్టు దగ్గర చేసే 'గాసిప్స్' వల్ల, దొంగ స్వామీజీ రోనీ (30 ఇయర్స్ పృథ్వీ) చెప్పిన జాతకం వల్ల మేనమామ (రవి వర్మ) ఆమె క్యారెక్టర్‌ను తప్పుగా అర్థం చేసుకుంటాడు. 

తేజ (మహేష్ యడ్లవల్లి)ను ప్రేమించిన సంగతి తండ్రికి చెబుతామని అజంతా అనుకుంటుండగా.. ప్రవీణ్ (గురు చరణ్) సంబంధం ముందు పెడతాడు తండ్రి. ఆ ఇద్దరిలో ఎవరిని అజంతా పెళ్లి చేసుకుంది? ఒక్క రాత్రిలో ఆమె జీవితం ఊహించని మలుపు తిరగడం వెనుక కారణం ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో దొరుకుతాయి.

విశ్లేషణ: 
సమాజంలో ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడటం ఎంతటి ప్రమాదకరమో దర్శకుడు వైభవ్ కౌండిన్య చక్కగా చూపించారు. ఎక్కడా అసభ్యత లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో మంచి సందేశాన్ని అందించారు.

గాసిప్ అనేది మూడు అక్షరాలు కావచ్చు. కానీ, సమాజంలో వాటి వల్ల కొన్నిసార్లు ఒకరి జీవితం ఎంత మారుతుందో చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. దర్శకుడు తన తొలి చిత్రానికే సామాజిక బాధ్యత ఉన్న కథను ఎంచుకోవడం ప్రశంసనీయం. కథలోని ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సాగుతుంది. టీ కొట్టు దగ్గర కుర్రాళ్ళు నోటికి వచ్చింది వాగడం రెండు నిమిషాల వినోదం కావచ్చు. ఇష్టం వచ్చినట్టు రోనీ స్వామి జాతకం చెప్పడం అతడికి పబ్లిసిటీ కావచ్చు. కానీ వాళ్ళు మాట్లాడే అబద్ధాలు, గాసిప్స్ వల్ల మనుషుల జీవితాలు నాశనం అవుతాయనేది చక్కగా చూపించారు వైభవ్ కౌండిన్య.

ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు చేసే పుకార్లు హీరోయిన్ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ఆ గాసిప్‌లను నమ్మడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారతాయి. చివరకు నిజం ఎలా బయటపడింది? అనే అంశంతో సినిమా ముందుకు సాగుతుంది. 

దర్శకుడు కథను మెలో డ్రామాగా మార్చలేదు. సహజమైన సంభాషణలతో చాలా సరళంగా సినిమాను ముందుకు నడిపించారు. ముఖ్యంగా టీ దుకాణాల వద్ద జరిగే గాసిప్ సంభాషణలను సమాజానికి అద్దం పట్టేలా చూపించారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చెప్పే జాతకాలు, నిరాధారమైన ప్రచారాలు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపించారు. అలాగే జాతకాల పేరుతో ప్రజలను మోసం చేసే నకిలీ స్వాములపై కూడా సెటైర్లు బాగా పేలాయి. అయితే నెమ్మదిగా సాగే కథనం, కొన్ని సాగదీత సన్నివేశాలు సినిమాకి కాస్త మైనస్ గా మారాయి. 

శక్తికాంత్ కార్తీక్ సంగీతం కథ మూడ్‌కు తగ్గట్టు సాగుతుంది. సతీష్ సినిమాటోగ్రఫీ సహజత్వాన్ని నిలబెట్టగా, జై కుమార్ ఎడిటింగ్ కథను వేగంగా ముందుకు తీసుకెళ్లింది. నిర్మాణ విలువలు కూడా కథకు తగిన స్థాయిలో ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
అందమైన, అమాయకమైన యువతిగా అజంతా పాత్రలో రాశి సింగ్ చక్కగా నటించారు. ఎటువంటి గ్లామర్ షో లేకుండా కథ మాత్రమే తెరపై కనిపించేలా రాశి సింగ్ నటన సాగింది. మహేష్ యడ్లపల్లి, గురు చరణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రవి వర్మ, విజయ్ ఆదిరాజు నటన కథకు బలాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా రోనీ స్వామి పాత్రలో 30 ఇయర్స్ పృథ్వీరాజ్ వినోదాన్ని పంచారు.

ఫైనల్ గా..
'గాసిప్' వినోదం కోసం తీసిన సినిమా కాదు. మనం విన్నది నిజమని నమ్మే ముందు.. ఒక్కసారి ఆలోచించాలనే సందేశాన్ని అందించిన సినిమా. మంచి సందేశంతో కూడిన భావోద్వేగ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్‌: 2.5/5

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.