Home  »  News  »  Dharman: ధర్మన్ వెనుక అసలు కథ ఇదే

Updated : Jun 25, 2026

 

సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్.. భారతీయ చలనచిత్ర రంగాన్ని శాసించిన ఈ ఇద్దరు మహామహులు దాదాపు 40 ఏళ్ల తర్వాత ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. కమల్ హాసన్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై రజనీకాంత్ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ 'ధర్మన్: ది డెడ్లీ డాక్టర్' (Dharman) అని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమా పూజా కార్యక్రమాల వేదికగా రజనీకాంత్ పంచుకున్న ఆసక్తికర విషయాలు, సినిమా వెనుక జరిగిన కథ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ సినిమా లాంచ్ ఈవెంట్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ తన మనసులోని మాటలను చాలా సరదాగా పంచుకున్నారు. "నేను మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే నోట్లో కొడుకట్టై (ఒక రకమైన స్వీట్) పెట్టుకున్నావా అని అడుగుతారు. మనల్ని ఇష్టపడని వారు మనం ఏం చేసినా మెచ్చుకోరని నాకు చాలా కాలం తర్వాత అర్థమైంది" అంటూ నవ్వులు పూయించారు. అలాగే ఈ సినిమా పూర్తి బాధ్యతలను కమల్ హాసన్ తనపైనే పెట్టేశారని, కథ వినమని తాను కమల్‌ను ఎంత బతిమాలినా ఆయన పూర్తిగా తన నిర్ణయాలకే వదిలేశారని రజనీ చెప్పుకొచ్చారు.

ఈ వేదికపై కమల్ హాసన్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. 1975వ సంవత్సరంలో తామిద్దరూ ఏవీఎం స్టూడియోస్‌లో ఒక వేపచెట్టు కింద కూర్చుని భవిష్యత్తు గురించి మాట్లాడుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పట్లోనే తాము భవిష్యత్తులో ఒకరి కోసం ఒకరం సినిమా నిర్మించుకోవాలని ఒక ప్రామిస్ చేసుకున్నామని, ఆ కల 40 సంవత్సరాల తర్వాత ఈ 'ధర్మన్' సినిమాతో నిజమైందని కమల్ ఎమోషనల్ అయ్యారు. 'ధర్మన్' ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రజనీకాంత్ చేతిలో సర్జికల్ బ్లేడ్ పట్టుకుని, బ్లడ్ స్టెయిన్స్‌తో చాలా ఇంటెన్స్, స్టైలిష్ డాక్టర్ అవతారంలో కనిపించి అంచనాలను పెంచేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ వెంటనే ప్రారంభం కానుంది. సిమ్రాన్, రాశీ ఖన్నా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


 ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయం నుంచి ఇప్పటివరకు ఏకంగా నలుగురు దర్శకులు మారడం విశేషం. మొదట సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ గారితో చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సుందర్ సి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. అయితే ఆయన కూడా తన ఇతర సినిమా కమిట్‌మెంట్ల వల్ల దీని నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 'డాన్' సినిమా దర్శకుడు సిబి చక్రవర్తి ఈ బాధ్యతలు తీసుకున్నారు. సిబి చెప్పిన న్యూక్లియర్ సైంటిస్ట్ కథ రజనీకాంత్‌కు బాగా నచ్చినప్పటికీ, ఆ కథ డిమాండ్ మేరకు ఆఫ్ఘనిస్తాన్, రష్యా వంటి దేశాలలో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల విపరీతమైన సమయం వృధా అవుతుందని భావించి, రజనీకాంత్ ఆ సుదీర్ఘ ప్రయాణాన్ని వద్దనుకున్నారు. చివరికి 'ఓ మై కడవులే' ఫేమ్ అశ్వత్ మరిముత్తు చెప్పిన స్క్రిప్ట్ అందరినీ మెప్పించడంతో ఆయన ఈ చిత్రానికి ఫైనల్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.