![]() |
![]() |
సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో సమంత తన పాత్ర కోసం పడ్డ కష్టాన్ని వివరిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల గురించి సమంత మాట్లాడుతూ, సినిమాలో ఎక్కడా గాల్లో ఎగిరే షాట్లు, అనవసరపు బిల్డప్‌లు లేదా స్లో మోషన్ సీక్వెన్స్‌లు ఉండవని స్పష్టం చేశారు. ప్రతి ఫైట్ సీన్ చాలా సహజంగా, రియలిస్టిక్‌గా ఉంటుందని తెలిపారు. సినిమాలో కనిపించేవన్నీ నిజమైన పంచులని, ఆ స్టంట్స్ చిత్రీకరించే సమయంలో తనకు చాలా సార్లు గట్టిగా దెబ్బలు తగిలి రక్తం కూడా వచ్చిందని సామ్ వెల్లడించారు. ఎంత కష్టమైనా డూప్ లేకుండా తానే స్వయంగా యాక్షన్ సీన్స్ చేశానని చెప్పారు.
ఈ సినిమాలో తాను పోషించిన 'స్వర్ణ' పాత్ర తన నిజ జీవిత స్వభావానికి అత్యంత దగ్గరగా ఉంటుందని సమంత పేర్కొన్నారు. సాంప్రదాయకమైన చీరకట్టులోనే ఆమె ఈ భారీ ఫైట్స్ చేయడం విశేషం. కేవలం డ్యాన్స్ కంటే కూడా తనకు స్క్రీన్‌పై యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడమే ఎక్కువ ఇష్టమని, అందుకే ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమించానని ఈ గ్లామర్ బ్యూటీ చెప్పుకొచ్చారు.
సమంత కెరీర్లో ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డితో కలిసి చేసిన మూడో చిత్రం ఇది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్లలోకి రాకముందే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారా పూర్తి పెట్టుబడిని రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. రాజ్ నిడిమోరు, సమంత సంయుక్తంగా 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై దీనిని నిర్మించారు.
ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామాపై సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. సమంత వన్-వుమెన్ షోగా నిలిచిన ఈ చిత్రంలో ప్రీ-ఇంటర్వెల్ ఫైట్ సీన్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ థియేటర్లలో అద్భుతంగా పండాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఈ 'బంగారం' ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి!
![]() |
![]() |