![]() |
![]() |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 'TG20 లీగ్' చుట్టూ ఊహించని విధంగా లీగల్ వివాదాలు ముసురుకున్నాయి. ఈ లీగ్‌తో అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా అసోసియేట్ అయిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) భారీ షాక్ ఇచ్చింది.
కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 మరియు టోర్ట్ లా నిబంధనల ప్రకారం విజయ్ దేవరకొండకు టీసీఏ తరపున లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే కాకుండా, ఈ లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న లేదా భాగస్వామ్యం వహిస్తున్న విక్టరీ వెంకటేష్, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, యువ సెన్సేషన్ తిలక్ వర్మ, మరియు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సహా దాదాపు 8 మంది సినీ, క్రీడా ప్రముఖులకు టీసీఏ ఈ నోటీసులు పంపడం ఇప్పుడు రెండు రంగాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఈ వివాదంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. TG20 అనేది ఒక ముమ్మాటికీ మోసపూరిత లీగ్ అని ఆయన ఘాటుగా విమర్శించారు. భారత క్రికెట్ నియంత్రణ (BCCI) రూల్ నంబర్ 31 ప్రకారం, ఏదైనా లోకల్ లీగ్ లేదా టోర్నమెంట్‌ని ప్రకటించే 45 రోజుల ముందే బీసీసీఐ నుంచి అధికారికంగా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ హెచ్‌సీఏ వద్ద అలాంటి ఎలాంటి అనుమతి పత్రాలు లేవు. దమ్ముంటే ఆ అప్రూవల్ లెటర్లను మీడియా ముందు ప్రదర్శించాలి. బీసీసీఐ అనుమతి లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ కంపెనీలు, ఫ్రాంచైజీల నుంచి హెచ్‌సీఏ భారీగా డబ్బులు వసూలు చేస్తూ వ్యాపారం చేస్తుంది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం.
ఈ టోర్నమెంట్ కేవలం ఒక సాధారణ క్రీడా కార్యక్రమం మాత్రమే కాదు. దీని వెనుక సుమారు 100 కోట్ల రూపాయల రాజకీయ,రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దాగున్నాయని . అధికారిక అనుమతులు లేని ఇలాంటి లీగ్‌లని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం ద్వారా వినియోగదారులను, యువ క్రికెటర్లను తప్పుదోవ పట్టించినట్లు అవుతుంది. ఈ అక్రమ లీగ్‌తో కుదుర్చుకున్న ఎండార్స్‌మెంట్లు, అగ్రిమెంట్లను సదరు ప్రముఖులు వెంటనే పునఃసమీక్షించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో తీవ్రమైన క్రిమినల్, సివిల్ న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also read: Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం ఆ సినిమా కథ అంట!.. త్రివిక్రమ్ చేస్తున్న పని ఏంటో తెలుసా!
నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ TG20 లీగ్ జూన్ 21 నుంచి జూలై 12 వరకు ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సి ఉంది. యువ ప్రతిభను వెలికితీసేందుకే ఈ లీగ్ నిర్వహిస్తున్నామని, తమకు అన్ని అనుమతులు ఉన్నాయని గతంలో హెచ్‌సీఏ ప్రకటించింది. కానీ తాజాగా టీసీఏ లీగల్ నోటీసులు జారీ చేయడంతో ఈ లీగ్ అసలు జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, లీగల్ ఫీజుల కోసమే హెచ్‌సీఏ దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేస్తోందని, ఆ డబ్బుతో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ను డెవలప్ చేయవచ్చని టీసీఏ సూచించింది. మరి ఈ లీగల్ నోటీసులపై విజయ్ దేవరకొండతో పాటు హెచ్‌సీఏ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

![]() |
![]() |