Home  »  News  »  Bharathiraja: భారతీరాజా ఆస్తుల విలువ ఇంతే! ఇప్పటి హీరోలతో పోల్చుకుంటే 

Updated : Jun 11, 2026

ప్రేమ కథలకి, గ్రామీణ కథలకి స్టార్ డమ్ తీసుకువచ్చిన దర్శక శిఖరం భారతిరాజా.     తెలుగులో సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలని తెరకెక్కించాడు. ముఖ్యంగా సీతాకోకచిలుక సినిమా వన్ ఇయర్ ఆడింది. ఎలాంటి స్టార్స్ లేకపోయినా వన్ ఇయర్ ఆడిందంటే భారతిరాజా ప్రతిభని అర్ధం చేసుకోవచ్చు.' కథ'నే స్టార్ అని నమ్మే  భారతీరాజా వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతు నిన్న  ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలియగానే కేవలం కోలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ సహా యావత్ భారతీయ సినీ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


భారతీరాజా  సంపాదించిన ఆస్తికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వివిధ మీడియా నివేదికలు, సినీ విశ్లేషకుల కథనాల ప్రకారం, భారతీరాజా మొత్తం ఆస్తి విలువ సుమారు 80 కోట్ల రూపాయల నుండి 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఒక సాధారణ పల్లెటూరు నుండి వచ్చి, కేవలం తన ప్రతిభనే నమ్ముకుని  దర్శకుడిగా, నటుడిగా, స్వంత నిర్మాణ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయంతో ఆయన ఆ స్థాయిలో సంపాదించినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా నేటితరం స్టార్ హీరోల రెమ్యునరేషన్లతో పోలిస్తే అది  తక్కువే కావచ్చు, కానీ సినిమా రంగానికి ఆయన అందించిన సాంస్కృతిక విలువ, వేలాది కళాఖండాల ముందు ఈ డబ్బు చాలా చిన్నది. ఆయన సంపాదించిన నిజమైన ఆస్తి ఆయన సృష్టించిన అమరకళాఖండాలే అని అభిమానులు చెప్తున్నారు.

 వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, ఆయన 1974లో చంద్రలీలని తన అర్ధాంగిగా స్వీకరించాడు. వీరికి కుమారుడు మనోజ్ భారతీరాజా, కుమార్తె జనని భారతీరాజా ఉన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి నటుడిగా, సహాయ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ భారతీరాజా, దురదృష్టవశాత్తు 2025 మార్చి నెలలో కేవలం 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు. ఈ తీరని లోటు భారతీరాజాని  మానసికంగా ఎంతో కుంగదీసింది. కుమార్తె జనని 1979లో జన్మించి, మలేషియాకు చెందిన రాజ్‌కుమార్ తంబిరాజాను వివాహం చేసుకుని ప్రస్తుతం పబ్లిక్ లైఫ్‌కు దూరంగా ఉంటున్నారు. భారతీరాజా సోదరుడు జయరాజ్ నటుడిగా, ఆయన బావ మనోజ్ కుమార్ దర్శకుడిగా చిత్రసీమలోనే రాణించారు. ఇలా పూర్తి కుటుంబం సినీ ఇండస్ట్రీతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంది. 


Also read: Jayam Ravi: గర్ల్ ఫ్రెండ్ తో జయం రవి ప్యాచప్.. అసలేం జరుగుతుంది!


1942 ఆగస్టు 23న తమిళనాడులోని తేని జిల్లా అల్లి నగరంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్. ఐదు దశాబ్దాల పాటు సాగిన తన సుదీర్ఘ కెరీర్‌లో దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు. 1977లో వచ్చిన '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ళ వయసు') చిత్రంతో దర్శకుడిగా సరికొత్త విప్లవానికి నాంది పలికారు. తమిళ ఇండస్ట్రీ దిశ కూడా మారిపోయింది. 'డైరెక్టర్ ఇమయమ్' (దర్శక శిఖరం)గా పిలవబడే భారతి రాజా  తన కెరీర్‌లో 40కి పైగా చిత్రాలకి  దర్శకత్వం వహించిన భారతీరాజా, రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి వంటి ఎందరో అగ్ర నటీనటులకు చిరస్మరణీయమైన విజయాలను అందించడమే కాకుండా, ఎంతోమంది కొత్త ప్రతిభని  ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక 'నంది అవార్డు' కూడా అందుకున్నారు.

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.