![]() |
![]() |

టాలీవుడ్‌లో థియేటర్ల అద్దెలు, పర్సంటేజ్ షేరింగ్ వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద యుద్ధానికి దారితీసింది. తాజాగా ఒక టీవీ ఛానల్ లో ప్రముఖ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ (Suniel Narang) మాట్లాడుతూ.. యువ నిర్మాత సితార నాగవంశీ(Naga Vamsi)పై ‘డూప్లికేట్ విగ్ ఫెలో’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా నిర్మాతలు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.
గడిచిన పదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న 'ఫిక్స్‌డ్ రెంటల్' (Fixed Rental) విధానమేనని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. దీని స్థానంలో 'పర్సంటేజ్ విధానం' తీసుకురావాలని సునీల్ నారంగ్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే, మల్టీప్లెక్స్ ఓనర్లు సింగిల్ స్క్రీన్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని నాగవంశీ కౌంటర్ ఇవ్వడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే సునీల్ నారంగ్ సహనం కోల్పోయి, నాగవంశీని ఉద్దేశించి "డూప్లికేట్ విగ్ ఫెలో" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తాను 33 సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిర్మించానని, ఎగ్జిబిటర్ల కష్టాలు తనకు తెలుసని, పరిశ్రమ మనుగడ కోసమే తాను పోరాడుతున్నానని నారంగ్ స్పష్టం చేశారు.
గత కొద్దిరోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం నడుస్తోంది. పర్సంటేజ్ విధానం అమలు చేయాల్సిందే అని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. అయితే కేవలం కొన్ని సినిమాలను టార్గెట్ చేస్తూ ఈ వివాదం చేస్తున్నారని నిర్మాతలు మండిపడుతున్నారు. అలాగే తమకు కూడా సమస్యలు ఉన్నాయని నిర్మాతలు అంటున్నారు. థియేటర్ యాజమాన్యాలు పర్సంటేజ్ షేరింగ్ అడిగే ముందు.. థియేటర్లలో కనీస సౌకర్యాలు, సీటింగ్, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.
రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ థియేటర్ల వివాదం పంపిణీ రంగంలో అలజడి సృష్టిస్తోంది. పెద్ద సినిమాల వసూళ్లపై ఈ అద్దె గొడవలు ఎటువంటి ప్రభావం చూపుతాయో అన్న ఆందోళన ట్రేడ్ వర్గాల్లో నెలకొంది.
ఏది ఏమైనా టాలీవుడ్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఉన్న ఈ విభేదాలు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం దురదృష్టకరం. మరి ఈ వివాదం ఇక్కడితో సర్దుమణుగుతుందా లేదా మరింత ముదురుతుందో చూడాలి. ఇండస్ట్రీ క్షేమం కోసం ఇరు వర్గాలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సగటు సినిమా అభిమాని కోరుకుంటున్నాడు.
![]() |
![]() |