Home  »  News  »  Tollywood: మీకే కాదు.. మాకు కూడా సమస్యలు ఉన్నాయి.. నిర్మాతల సంచలన ప్రెస్ మీట్!

Updated : May 13, 2026

ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్లు ఏక పక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి బెదిరించినట్టుగా మాట్లాడటం సరికాదని, అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలు అన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ సమస్యలకు కూడా పరిష్కారం కావాలని నిర్మాతలు అన్నారు.

నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్ నిర్వహించి వారికి అన్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ అంశంపై నిర్మాతల కోణం కూడా తెలియజేయాలని, నిజానిజాలు తెలపాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఎగ్జిబిటర్లు బాగా ఇబ్బందులు పడుతున్నారు, అందుకే పర్సెంటేజ్ విధానానికి రావాలి అనుకుంటున్నామని తెలిపారు. ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు.. మేము దానికి అంగీకరిస్తాం. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని మీరు దయచేసి గ్రహించండి. ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ సంతోషంగా లేరు. కానీ, మేము ఒక్కరిమే మా ప్రయోజనం మేము చూసుకొని వెళ్ళిపోతాము అనడం సరైనది కాదు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలి. రాత్రికి రాత్రే జరిగిపోవాలంటే జరిగిపోయేవి కావు. ముగ్గురికీ సమస్యలు ఉన్నాయి. చర్చించుకొని పరిష్కరించుకుందాం. 'హరి హర వీరమల్లు' విడుదల సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చింది. అప్పటినుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే జరిగిపోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందాం. నాలుగైదు నెలల నుంచి సరైన సినిమా లేక అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. పెద్ది రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు. సమస్య ఉంది, మేము కాదనడం లేదు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు అన్ని సమస్యలు చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందాం. ఒక పద్దతి ప్రకారం చేసుకోవాలి. థియేటర్లను గ్రేడింగ్ చేసుకోవాలి. అన్ని థియేటర్లలో ఒకే రకమైన వసతులు ఉండవు కాబట్టి అన్నింటిని ఒకే గాడికి కట్టలేము. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వసతులు మెరుగు పర్చాలి. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే పరిస్కారమవుతాం. అందరం కలిసికట్టుగా ముందుకి వెళ్దాం." అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఎకో సిస్టమ్ లో ఒకరు బాగోకపోతే ముగ్గురూ బాగోరు. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ముగ్గురూ బాలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిబిటర్ల పరిస్థితి బాలేదని చెప్పారు. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల పరిస్థితి కూడా అలాగే ఉంది. కొన్ని నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. కంటెంట్ లేక శ్రీరాములు లాంటి థియేటర్ ను మూసేయాల్సి వచ్చిందని వాళ్ళే చెప్పారు. ఎగ్జిబిటర్లు ఇలాంటి షరతులు పెట్టడం వల్ల నిర్మాతల నుంచి ఇంకా కంటెంట్ తగ్గిపోతుంది తప్ప, దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు కదా. ఇలా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొని, ఫలానా తేదీ చివరి రోజు అంటూ బెదిరించినట్టుగా మాట్లాడకండి. ఇక్కడ ఉన్న నిర్మాతలవి 50 శాతానికి పైగా షూటింగ్ అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి. వీటిలో చిన్న, పెద్ద అన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే 70-80 శాతం బడ్జెట్ ఖర్చు పెట్టి ఉన్నాము. ఇలాంటి సమయంలో కొత్త విధానం తీసుకొస్తామంటే అది సబబుగా ఉండదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాల విషయంలో ఆ విధానాన్ని అంగీకరించలేము. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో ఈ విధానంపై ఆలోచిస్తాము. కానీ, దానికి కొన్ని షరతులు ఉన్నాయి. థియేటర్ల గ్రేడింగ్, మెయింటనెన్స్ ఛార్జ్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కన్వినెన్స్ ఛార్జ్ వంటి విషయాలపై చర్చించిన తర్వాత.. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో పర్సెంటేజ్ విధానానికి వెళ్ళడంలో మాకు అభ్యంతరం లేదు. ఒక పెద్ద ఎగ్జిబిటర్, ఆయనకు 300 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆదాయానికి గండి కొడుతున్న అలాంటి ఆయన.. నిన్న ప్రెస్ మీట్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించింది. ఇతర రాష్ట్రాల్లో పర్సెంటేజ్ విధానం అమల్లో ఉంది అంటున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ఎవరి పరిస్థితి బాలేదు. వాళ్ళకంటే మనమే మెరుగైన స్థితిలో ఉన్నాము. అలాంటిది మనం వెనక్కి వెళ్లడం ఎందుకు?. ఎగ్జిబిటర్ ఎంత ముఖ్యమో, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ముఖ్యం కదా. అలాంటిది డిస్ట్రిబ్యూటర్ ను చంపేసి, ఎగ్జిబిటర్ ను కాపాడాలి అనడం ఎంతవరకు కరెక్ట్?. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మెరుగైన వసతులు కల్పిస్తే.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది." అన్నారు. 

నిర్మాత సాహు గారపాటి  మాట్లాడుతూ.. "నిన్న ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్ చూసిన తర్వాత మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే అది బెదిరించినట్టుగా ఉంది కానీ, కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందాం అన్నట్టుగా లేదు. మనంలో మనం ఇలా కొట్టుకోవడం వల్ల లోకువ అయిపోతాం. సమస్యను పరిష్కరించుకునే దిశగా మనం వెళ్ళట్లేదు. ఈ అంశంపై ఫిల్మ్ ఛాంబర్ తరపు నుంచి కూడా మీటింగ్ లు జరిగాయి. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే, అలా ఏక పక్షంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో మాకు అర్థం కావడంలేదు. ప్రతిసారీ ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదోక ఆటంకం కలిగిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సినిమాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకొని, టికెట్ ధరలు పెంచుకున్నాం. అలాంటిది నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అనుమతి లభించినా, మేము థియేటర్లలో ప్రదర్శించం అంటున్నారు. అంటే ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా వెళ్దాం అనుకుంటున్నారో ఏంటో అర్థం కావడంలేదు. ఇలా చేయడం సరైనది కాదు. ప్రతి సినిమా మన సినిమానే. సినిమా నడిస్తేనే సినీ పరిశ్రమను నమ్మకున్న మనందరం నడుస్తాం. అది పక్కన పెట్టి, ఒక్కో సినిమాకు ఒక్కోలా చేయడం అనేది సరైనది కాదు. అందరం కూర్చొని మాట్లాడుకొని, నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది." అన్నారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. "20 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అందరికీ తెలుసు. 20 సంవత్సరాల నుంచి ఎగ్జిబిటర్లకు న్యాయం చేయలేనిది ఈరోజు గుర్తుకొచ్చిందా?. మొన్న సంక్రాంతి సినిమాలకు కూడా టికెట్ రేట్లు తెచ్చుకున్నారు కదా?. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు?" అన్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.