Home  »  News  »  Sathi Leelavathi Review: సతీ లీలావతి మూవీ రివ్యూ

Updated : May 8, 2026

తారాగణం: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, నరేష్, సప్తగిరి, VTV గణేష్, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిక్ తదితరులు 
సంగీతం: మిక్కీ జె. మేయర్
డీఓపీ: బినేంద్ర మీనన్
ఎడిటింగ్: సతీష్ సూర్య
మాటలు: ఉదయ్ పొట్టిపాడు
దర్శకత్వం: సత్య తాతినేని
నిర్మాతలు: నాగమోహన్ బాబు. ఎమ్, రాజేష్ టి
సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
బ్యానర్లు: దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్
విడుదల తేదీ: మే 8, 2026

పెళ్ళి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన మొదటి మూవీ 'సతీ లీలావతి'. మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా, 'భీమిలి కబడ్డీ జట్టు' ఫేమ్ దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించిన ఈ సినిమా నేడు (మే 8) విడుదలైంది. మరి ఈ భార్యాభర్తల ఫన్నీ పోరాటం ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించింది? లావణ్య సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకుందాం. (Sathi Leelavathi Movie Review)

కథ:
లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక సినిమా డైరెక్టర్. లీలావతి తన కెరీర్‌తో బిజీగా ఉంటూ తనకు సమయం కేటాయించడం లేదని, విడాకులు కావాలని ఆమె భర్త రామ్ (దేవ్ మోహన్) కోరుతాడు. అంతేకాకుండా తాను నికోలా (మడోన్నా సెబాస్టియన్) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని షాక్ ఇస్తాడు. భర్తను వదులుకోవడం ఇష్టం లేని లీలావతి, అతన్ని ఇంట్లోనే కట్టేసి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? రామ్ మనసు మారిందా? లీలావతి-రామ్ ఒక్కటయ్యారా లేదా? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:
పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన తొలి సినిమా కావడం, పైగా ఇది భార్యాభర్తల మధ్య సాగే ఫ్యామిలీ డ్రామా అని ప్రచారం చేయడంతో ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి నెలకొంది. అయితే, సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో తడబడింది.

సినిమా ప్రారంభంలో భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల అంశంతో కథ వేగంగానే మొదలవుతుంది. తనను కాదని మరో అమ్మాయి దగ్గరకు వెళ్తున్న భర్తను లీలావతి కొట్టి కట్టేయడం అనే పాయింట్ వినడానికి బాగున్నా, స్క్రీన్ మీద అది పండలేదు. సాగదీత సన్నివేశాలతో కథ నెమ్మదిగా నడుస్తుంది,

లీలా తండ్రి (నరేష్), నిర్మాత (మొట్ట రాజేంద్రన్) ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇంటికి రావడం, కట్టేసిన భర్తను వారు చూస్తారేమో అని లీలావతి పడే టెన్షన్ ద్వారా దర్శకుడు కొంత సస్పెన్స్‌ని మెయింటైన్ చేయగలిగారు కానీ, అది కథను ముందుకు నడిపించలేకపోయింది. ఇక లీలా-రామ్ లవ్ స్టోరీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్లు మరీ సిల్లీగా ఉన్నాయి.

సెకండ్ హాఫ్‌లో సినిమా ట్రాక్ తప్పుతుంది. లీల కిడ్నాప్ డ్రామా, దొంగ ఎంట్రీ వంటి ఎపిసోడ్లతో కథను సాగదీశారు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ కంటే, అనవసరమైన సన్నివేశాలే ఎక్కువయ్యాయి. అసలు కథ ఎటు వెళ్తుందో అర్థం కాని స్థితిలో చివర్లో ఇచ్చే రెండు ట్విస్టులు కాస్త ఊరటనిస్తాయి తప్ప, సినిమాను నిలబెట్టలేవు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
లీలావతిగా లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంది. డైరెక్టర్‌గా, భర్తను ప్రేమించే భార్యగా రెండు షేడ్స్‌లోనూ చక్కగా నటించారు. దేవ్ మోహన్ పాత్రలో కానీ, నటనలో కానీ పెద్దగా మెరుపులు లేవు. ఈ సినిమాలో సప్తగిరి, విటివి గణేష్, మొట్ట రాజేంద్రన్ వంటి భారీ కామెడీ తారాగణం ఉన్నప్పటికీ, సరైన రైటింగ్ లేకపోవడంతో వారు నవ్వించలేకపోయారు. ఏదో ఒకటి రెండు చోట్ల తప్ప, మిగతా సీన్స్ కామెడీ బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది.

'భీమిలి కబడ్డీ జట్టు' లాంటి సినిమా చేసిన దర్శకుడు తాతినేని సత్య నుంచి ఇలాంటి సినిమా ఊహించలేం. రచన పూర్తిగా తేలిపోయింది. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. మిక్కీ జె. మేయర్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
లావణ్య త్రిపాఠి నటన
కొన్ని కామెడీ సీన్స్
క్లైమాక్స్‌ ట్విస్టులు

మైనస్ పాయింట్స్:
కథాకథనాలు
మిస్సైన ఎమోషన్

ఫైనల్ గా..
కథాకథనాల్లో బలం లేకపోవడం వల్ల సినిమా తేలిపోయింది. లావణ్య తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, సాగదీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.

రేటింగ్: 2/5

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.