![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ప్రస్తుతం తన తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) తెరంగేట్రం విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో జునైద్ ఖాన్, సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తాజా చిత్రం 'ఏక్ దిన్' (Ek Din). తెలుగులో ఈ సినిమా 'ఒక రోజు' అనే టైటిల్‌తో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమిర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆమిర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'ఏక్ దిన్' సినిమా పట్ల చిత్రబృందం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. "ఇది నేను నమ్మిన కథ. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ, మేము చెప్పాలనుకున్న కథను ప్రాణం పోసి తెరపై చూపించగలిగామా లేదా అనేదే నాకు ముఖ్యం. నా దృష్టిలో విజయానికి అదే మొదటి కొలమానం" అని ఆమిర్ పేర్కొన్నారు. సాధారణంగా భారీ వసూళ్లు సాధిస్తేనే సినిమా సక్సెస్ అనుకుంటారు, కానీ నచ్చని సినిమా బాగా ఆడితే వచ్చే విజయం తనకు సంతోషాన్ని ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు.

ఈ చిత్రం ద్వారా జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతుండగా, సాయి పల్లవికి ఇది హిందీలో తొలి చిత్రం కావడం విశేషం. ఇది చాలా చిన్న సినిమా అని, కొత్త నటీనటులు ఉండటం వల్ల ప్రేక్షకుల వరకు చేరడానికి కొంత సమయం పడుతుందని భావించే ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించామని ఆమిర్ చెప్పారు. సునీల్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కథను తాను బలంగా నమ్మానని, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒక తండ్రిగా తన కుమారుడు జునైద్‌ను వెండితెరపై చూడాలని ఆమిర్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కేవలం స్టార్ హోదా కోసం కాకుండా, కంటెంట్‌ను నమ్మి తీసిన 'ఏక్ దిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం హిందీలో 'రామాయణ' వంటి భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సాయి పల్లవికి కూడా ఏక్ దిన్' అక్కడ శుభారంభాన్ని ఇస్తుందేమో చూడాలి.
![]() |
![]() |