![]() |
![]() |

టెక్నాలజీ పుట్టిందే సైబర్ నేరాల కోసం అన్నట్టుగా సైబర్ నేరగాళ్లు దేశానికి స్వాతంత్రం తెచ్చింది మేమే అనే వీరుల్లా విజృంబిస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ ఈ మోసగాళ్ల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ నటి, 'ది కపిల్ శర్మ షో' ఫేమ్ అర్చన పురాణ్ సింగ్(Archana Puran singh)కుమారుడు ఆయుష్మాన్ సేథీ భారీ సైబర్ మోసానికి గురయ్యి తన క్రెడిట్ కార్డ్ ద్వారా ఏకంగా 87,000 రూపాయలు పోగొట్టుకున్నారు.
ఆయుష్మాన్ సేథీ ఫోన్‌కి క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయుష్మాన్ క్రెడిట్ కార్డ్ వివరాలను సేకరించి, అతని అనుమతి లేకుండానే షాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఎనిమిది విభిన్న లావాదేవీల ద్వారా మొత్తం రూ. 87,000 డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో ఆయుష్మాన్ వెంటనే అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఓటీపీ లేకుండా ఇలాంటి లావాదేవీలు జరగడం కష్టమైనప్పటికీ, అంతర్జాతీయ లావాదేవీలు లేదా క్లోనింగ్ ద్వారా ఈ మోసం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే ఆయుష్మాన్ ముంబైలోని అంబోలి పోలీసులను ఆశ్రయించారు. తన క్రెడిట్ కార్డు నుంచి అనధికారికంగా డబ్బులు కట్ అయ్యాయని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ విభాగం ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తోంది. బాధితుడి అకౌంట్ నుండి డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఏ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ లావాదేవీలు జరిగాయి? అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు.
గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ప్రముఖులే లక్ష్యంగా సైబర్ దొంగలు విరుచుకుపడుతున్నారు. కేవలం అర్చన పురాణ్ సింగ్ కుమారుడే కాకుండా, ఇటీవల కాలంలో మరికొందరు నటీనటులు కూడా ఆన్‌లైన్ మోసాలకు గురయ్యారు. సైబర్ నేరగాళ్లు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లుగా నటించడం లేదా ఆకర్షణీయమైన లింక్‌లు పంపడం ద్వారా క్రెడిట్ కార్డ్ వివరాలని తస్కరిస్తున్నారు.
ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్న పొరపాటు జరిగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అర్చన పురాణ్ సింగ్ కుమారుడికి ఎదురైన ఈ అనుభవం అందరికీ ఒక హెచ్చరిక వంటిది. మన క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎవరికీ షేర్ చేయకూడదని, అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయవద్దని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే '1930' నంబర్‌కు ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
![]() |
![]() |