Home  »  News  »  Ashu Reddy: అషురెడ్డిపై పోలీసు కేసు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లకు పైగా మోసం..!

Updated : Apr 26, 2026

సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) చిక్కుల్లో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక వ్యక్తి నుంచి కోట్ల రూపాయలు కాజేసినట్లు ఆమెపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో కేసు నమోదైంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.

అసలేం జరిగింది?
పోలీసుల సమాచారం ప్రకారం.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర అనే వ్యక్తికి 2018లో అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పట్లో తను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని ఆమె అతనికి చెప్పింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన ఆర్థిక అవసరాల పేరుతో ఆమె ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రూ. 9.35 కోట్ల మోసం!
ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు పేర్కొన్నారు. 2018 నుండి 2025 మధ్య కాలంలో అషురెడ్డి వివిధ రూపాల్లో ధర్మేంద్ర నుంచి దాదాపు రూ. 9.35 కోట్లు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఇందులో నగదుతో పాటు సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన లగ్జరీ కార్లు, హైదరాబాద్‌లో ఖరీదైన ఫ్లాట్లు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీటన్నింటినీ ధర్మేంద్ర డబ్బుతో కొనుగోలు చేసి, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుందని బాధితుడి కుటుంబం వాపోతోంది. అంతేకాకుండా అషురెడ్డి సోదరి కూడా సుమారు రూ. 50 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు.

కుటుంబ సభ్యుల ప్రమేయం?
పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నామంటూ అషురెడ్డి కుటుంబ సభ్యులు కూడా తమను నమ్మించారని బాధితుడి తండ్రి తెలిపారు. అయితే గత కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు ముఖం చాటేస్తున్నారని, చివరకు తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు వారు పేర్కొన్నారు.

పోలీసుల దర్యాప్తు
బాధితుడి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో డ్రగ్స్ కేసు విచారణలో పేరు వినిపించి వార్తల్లో నిలిచిన అషురెడ్డి, ఇప్పుడు ఏకంగా రూ. 9 కోట్ల మోసం కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలపై అషురెడ్డి ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.