![]() |
![]() |

టాలీవుడ్ లో నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఫిలిం ఇండస్ట్రీలోని సమస్యలపై, ముఖ్యంగా 'థియేటర్ మాఫియా', ఓటీటీ రిలీజ్ నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిర్మాతలను ఎలా నాశనం చేస్తున్నాయో ఆయన తనదైన శైలిలో వివరించారు.
నిర్మాతలకు స్వేచ్ఛ ఎక్కడ?
నట్టి కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాత కేవలం ఒక 'క్యాషియర్'లా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ ఎప్పుడు జరగాలి, ఏ డేట్‌కి రిలీజ్ అవ్వాలి అనే విషయాలను హీరోలు, దర్శకులే నిర్ణయిస్తున్నారని, నిర్మాతకు తన సొంత సినిమాపై ఎటువంటి హక్కు లేదని ఆయన విమర్శించారు. సెట్స్ లో నిర్మాత ఎక్కడ కూర్చోవాలో కూడా హీరో స్టాఫ్ లేదా డైరెక్టర్ చెప్పే పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు.
ఓటీటీ రిలీజ్ వివాదం - 8 వారాల నిబంధన
సినిమా విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదని నిర్మాతలు చర్చించుకుంటున్నారు. అయితే, ఈ తీర్మానాలు కేవలం మీటింగులకే పరిమితమవుతున్నాయని నట్టి కుమార్ ఎద్దేవా చేశారు. "మధ్యాహ్నం వరకు మీటింగ్‌లో కూర్చుని ఎనిమిది వారాల వరకు సినిమా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంటారు. కానీ, సాయంత్రం కాగానే 8 వారాల నిబంధన పక్కనపెట్టి ఆ నిర్మాతలే ఓటీటీ సంస్థలతో బేరాలు మాట్లాడుకుంటున్నారు." అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్యూబ్, యూఎఫ్ఓ రేట్లు
థియేటర్ల వ్యవస్థపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. క్యూబ్, యూఎఫ్ఓ రేట్లు తగ్గించాలని తాము ధర్నా చేస్తుంటే, మరోవైపు ఇండస్ట్రీలోని పెద్దలే వాటి వెనుక ఉండి రేట్లు పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు రాబోయే రోజుల్లో కనుమరుగవుతాయని, కేవలం మల్టీప్లెక్సులు మాత్రమే మిగిలిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీలో మార్పు రావాలంటే నిర్మాతలందరూ ఐక్యంగా ఉండాలని, కేవలం మీటింగులతో కాలక్షేపం చేయకుండా తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నట్టి కుమార్ పిలుపునిచ్చారు. నట్టి కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
![]() |
![]() |