Home  »  News  »  జైలర్ 2 సెట్స్‌ నుంచి వీడియోలు లీక్‌.. సోష‌ల్‌ మీడియాలో వైరల్!

Updated : Apr 17, 2026

- షాక్‌లో సూప‌ర్‌స్టార్‌ ఫ్యాన్స్‌

- ‘జైలర్ 2’పై పైరసీ నీడ!

- మేకర్స్ సీరియస్ వార్నింగ్!

సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం 'జైలర్' గురించి అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా రజనీ స్టామినాని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక చేదు వార్త చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే కీలకమైన రెండు సీన్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్స్‌లో రజనీకాంత్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ లీకేజీ వార్త తెలియగానే చిత్ర బృందం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. భారీ బడ్జెట్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలోని దృశ్యాలు ఇలా బయటకు రావడంపై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మేకర్స్, పైరసీ నిరోధక బృందాన్ని రంగంలోకి దింపారు.

ఈ లీకైన వీడియోలను ఎవరూ షేర్ చేయవద్దని, ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జైలర్ 2 మేకర్స్ అధికారికంగా హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలపై నిరంతరం నిఘా ఉంచామని, లీకైన కంటెంట్‌ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. భారీ అంచనాలు ఉన్న సినిమాలో ఇలాంటి పరిణామాలు మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి.

గతంలో వచ్చిన ‘జైలర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఆ చిత్రంలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీ నటన, అనిరుధ్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ రెండో భాగంలో కూడా మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో మెరిసే అవకాశం ఉంది.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో ఇటువంటి లీకేజీలు సర్వసాధారణం అయిపోయాయి. కానీ, సినిమా మేకింగ్ వాల్యూస్ దెబ్బతినకుండా ఉండాలంటే ప్రేక్షకులు కూడా సహకరించాలని చిత్ర పరిశ్రమ కోరుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఈ లీకేజీని ఖండిస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను థియేటర్లలోనే చూస్తామని, ఇటువంటి లీక్డ్ వీడియోలను ప్రోత్సహించవద్దని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

ముఖ్యంగా రజనీకాంత్ గత చిత్రం ‘కూలీ’ పై మిశ్రమ స్పందన రావడంతో, అందరి దృష్టి ఇప్పుడు ‘జైలర్ 2’ పైనే ఉంది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఈసారి అంతకు మించి అనేలా యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ లీకేజీల బెడదను దాటుకుని ముత్తువేల్ పాండియన్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. త్వరలోనే ఈ మూవీ టీజర్ లేదా గ్లింప్స్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.