Home  »  News  »  పూరి జగన్నాథ్‌గారిది గొప్ప మనసు.. ఎమోషనల్ అయిన హరీష్ శంకర్

Updated : Mar 17, 2026

- నా ఫ్లాప్ టైంలో పూరి అన్నే దిక్కు.. మూడేళ్లు నన్ను పోషించారు: దర్శకుడు హరీష్ శంకర్.

- 'ఉస్తాద్ భగత్ సింగ్' డైరెక్టర్ హరీష్ శంక‌ర్‌కి పూరి జగన్నాథ్ చేసిన సాయం గుర్తొస్తే కన్నీళ్లే!

- పూరి జగన్నాథ్‌తో హరీష్ శంకర్‌కి ఉన్న‌ అనుబంధం ఇదే!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన, ప్రస్తుతం అదే కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన తన కెరీర్ లోని చీకటి రోజులను తలచుకుంటూ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

హరీష్ శంకర్ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పూరి జగన్నాథ్ తన జీవితంలో ఎంతటి కీలక పాత్ర పోషించారో వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. దర్శకుడిగా తన మొదటి సినిమా ‘షాక్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని, ఆ సమయంలో తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని వెల్లడించారు. సరిగ్గా అప్పుడే కొత్తగా పెళ్లయి కుటుంబ బాధ్యతలు తలకెత్తుకున్న తనకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైందని ఆయన పేర్కొన్నారు.

కష్టాల్లో ఉన్న తనను పూరి జగన్నాథ్ స్వయంగా పిలిచి అండగా నిలిచారని హరీష్ చెప్పారు. “పెళ్లై, ఒక ఫ్లాప్ సినిమా ఇచ్చిన దర్శకుడి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు.. నువ్వు కంగారు పడకు, నాతో ఉండు” అని ధైర్యం చెప్పడమే కాకుండా, దాదాపు రెండు మూడు ఏళ్ల పాటు తనను రైటర్ గా పెట్టుకుని ఆర్థికంగా ఆదుకున్నారని హరీష్ గుర్తు చేసుకున్నారు. పూరి అన్న చేసిన ఆ సాయాన్ని జీవితాంతం మర్చిపోలేనని ఆయన కృతజ్ఞత చాటుకున్నారు.

రామ్ చరణ్ టాలీవుడ్ అరంగేట్రం చేసిన ‘చిరుత’ సినిమా సమయంలో పూరి జగన్నాథ్ తో కలిసి పనిచేయడం తనకొక ‘పెయిడ్ ఇంటర్న్‌షిప్’ లాంటిదని హరీష్ అభివర్ణించారు. ఆ సమయంలో పూరి దగ్గర మేకింగ్ లోని మెళకువలు, వేగంగా స్క్రిప్ట్ రాయడం వంటి అంశాలను నేర్చుకున్నానని, అది తన తర్వాతి విజయాలకు పునాది వేసిందని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న హరీష్ శంకర్, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలుపెట్టాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కి హరీష్ మార్క్ డైలాగులు తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూరి వంటి దిగ్గజ దర్శకుల స్ఫూర్తితో హరీష్ మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు.

త్వరలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించిన మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ రానున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్-హరీష్ కాంబోలో రాబోతున్న ఈ రెండో చిత్రం కోసం సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.