Home  »  News  »  Maha Shivaratri: తెలుగుతెరపై శివయ్యలు.. పరమశివుని పాత్రకు ప్రాణం పోసిన నటులు.. ఎన్టీఆర్ టు చిరంజీవి!

Updated : Feb 14, 2026

 

"శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు" అంటారు. ఈ విశ్వం మొత్తం ఈశ్వరమయం అని, పుట్టుక నుండి మరణం వరకు ఈ సృష్టిలో జరిగే ప్రతిదీ శివుని అనుమతితోనే జరుగుతుంది అనేది భక్తుల నమ్మకం. ఆ భోళా శంకరుడి భక్తుల్లో వెండితెర కూడా ఉంది. వెండితెరపై ఆ మహేశ్వరుడి నేపథ్యంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. పలువురు నటులు శంకరుడి పాత్రలో నటించి, భక్తులను పరశింపచేయడానికి ప్రయత్నించారు. మహాశివరాత్రి సందర్భంగా మన తెలుగు తెరపై శివుడిగా మెప్పించిన ప్రముఖ నటుల గురించి తెలుసుకుందాం.

 

తెలుగు తెరపై తొలి శివుడు 1935లో కనబడ్డాడు. దాసరి కోటిరత్నం నిర్మించిన 'సతీ అనసూయ'లో శివుడి పాత్ర ఉంది. అయితే ఆ పాత్ర ఎవరు చేశారనేది మాత్రం పెద్దగా తెలియలేదు.

 

ఎన్టీఆర్‌
తెలుగు ప్రేక్షకులకు దేవుని పాత్రలంటే గుర్తుకొచ్చే పేరు నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడే కాదు శివుడి పాత్రలోనూ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. 'దక్షయజ్ఞం'లో ఎన్టీఆర్ చేసిన శివుని పాత్ర నభూతో నభవిష్యతి. క్లైమాక్స్ లో శివుని రుద్రతాండవం చూస్తే, రోమాలు నిక్కబొడవాల్సిందే. 'ఉమాచండీ గౌరీశంకరుల కథ' సినిమాలో కూడా ఎన్టీఆర్ శివుడిగా మెప్పించారు.

 

 

ఏఎన్నార్
అక్కినేని నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో శివుడిగా కనిపించకపోయినా, 'మూగ మనసులు' సినిమాలోని 'గౌరమ్మ నీ మొగుడెవరమ్మ' పాటలో శివుడిగా కనిపించి ఆకట్టుకున్నారు.

 

 

శోభన్ బాబు
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘'పరమానందయ్య శిష్యుల కథ' సినిమాలో శోభన్ బాబు శివుడి పాత్రలో నటించి మెప్పించారు.

 

 

కృష్ణంరాజు
'శ్రీ వినాయక విజయం' సినిమాలో శివుడిగా కనిపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు కృష్ణంరాజు. అలాగే ఆయన శివ భక్తుడిగా నటించిన 'భక్త కన్నప్ప' చిత్రంలో పరమశివునిగా ఎం.బాలయ్య నటించారు. 

 

 

చిరంజీవి 
మాస్ హీరో అయ్యుండి, పరమశివుని పాత్రను పోషించడం చిన్న విషయం కాదు. కెరీర్ మంచి పీక్ లో ఉన్న టైంలో 'శ్రీ మంజునాథ' సినిమాలో పరమశివునిగా అద్భుత నటనను కనబర్చారు చిరంజీవి. అలాగే 'పార్వతీ పరమేశ్వరులు', 'ఆపద్బంధవుడు', 'జగద్గురు ఆదిశంకర' చిత్రాల్లోనూ కొన్ని సన్నివేశాల్లో శివుడిగా మెరిశారు.

 

 

బాలకృష్ణ
ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో పౌరాణిక పాత్రలు పోషించగల నటుడిగా బాలకృష్ణ గుర్తింపు పొందారు. శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా తనదైన ముద్ర వేసిన బాలయ్య.. 'సీతారామ కళ్యాణం' సినిమాలోని ఓ పాటలో శివుడిగా కనువిందు చేశారు.

 

 

నాగార్జున
'జగద్గురు ఆది శంకర' చిత్రంలో శివుడు చండాలుడుగా కనిపించే పాత్రలో నాగార్జున కాసేపు కనిపించారు. అలాగే, నాగార్జున హీరోగా నటించిన 'ఢమరుకం' సినిమా కూడా శివ నేపథ్యమే. ఇందులో శివుడిగా ప్రకాష్ రాజ్ కనిపించారు.

 

 

వీరితో పాటు పలువురు నటులు తెలుగు తెరపై శివుడిగా మెప్పించారు.

 

ఎన్టీఆర్ హీరోగా నటించిన  'మాయా మశ్చీంద్ర' సినిమాలో అలనాటి తెలుగు హీరో రామకృష్ణ శివుయ్య పాత్రలో దర్శనమిచ్చారు.

 

మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించిన  'కన్నప్ప' చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ శివుడి పాత్ర పోషించడం విశేషం.

 

నాగుల చవితి, ఉమా సుందరి సినిమాల్లో నాగభూషణం, ఉషా పరిణయంలో రాజనాల, మా ఊర్లో మహాశివుడు సినిమాలో రావుగోపాల రావు, ఏకలవ్య చిత్రంలో రంగనాథ్ వంటి నటులు శివుడి పాత్రలో నటించారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.