![]() |
![]() |
ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు చిరంజీవి. 47 సంవత్సరాల క్రితం 1978 సెప్టెంబర్ 22న ‘ప్రాణం ఖరీదు’ చిత్రం విడుదలైంది. భవిష్యత్తులో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలతారని, అందరివాడుగా, మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారని ఎవరూ అనుకోలేదు. కె.వాసు దర్శకత్వంలో వచ్చిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో ఒక సహాయ పాత్రలో నటిచారు చిరంజీవి. పట్టుదల, స్వయంకృషితో ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో మంది కొత్త కథానాయకులు తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి విజయాలు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి జీవితం ఇప్పుడు భారతీయ సినిమా చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచింది. తన అసాధారణమైన నటన, డాన్స్, యాక్షన్‌తో లక్షలాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
తన కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరుచుకున్నారు చిరంజీవి. హీరోగానే నటించాలి అనే నిబంధన ఆయన పెట్టుకోలేదు. హీరో అయినా, విలన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా ఆ పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించాలన్నదే ఆయన లక్ష్యం. దాన్ని సాధించుకునే క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక శక్తిగా ఎదిగారు. పూర్తి స్థాయి హీరోగా మారిన తర్వాత 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిత్రం చిరంజీవి కెరీర్‌ని పూర్తిగా టర్న్ చేసింది. ఈ సినిమాతో మాస్ హీరోగా ఎదిగిన చిరంజీవికి ఇది ఒక మైలురాయి లాంటి సినిమా అని చెప్పొచ్చు.
‘ఖైదీ’ తర్వాత పసివాడి ప్రాణం, రుద్రవీణ, స్వయంకృషి, విజేత, చంటబ్బాయ్, ఆపద్బాంధవుడు, కొండవీటి దొంగ, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్‌లతో తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్నారు చిరంజీవి. కొంత గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ సినిమా సాధించిన ఘన విజయంతో మళ్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు. చిరంజీవి సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, ఒక సామాజిక సందేశాన్ని కూడా అందించేలా ఉంటాయి. చిరు డ్యాన్స్, యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఎప్పటికీ ఆకర్షిస్తాయి. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో చిరు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
ఈ రోజుకీ చిరంజీవి అంటేనే ఒక వైబ్రేషన్. రాబోయే సంక్రాంతికి ఆయన హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే వేసవిలో ‘విశ్వంభర’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా, బాబీ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. చిరంజీవి తన సినీ ప్రయాణంలో ఎప్పటిలాగే ముందుంటూ, అభిమానులకు కొత్త సినిమాలతో ఆనందాన్ని అందించడానికి రెడీగా ఉన్నారు.
చిరంజీవి కేవలం సినిమా నటుడిగానే కాకుండా, ఒక గొప్ప మానవతావాదిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నెలకొల్పి వేలాది మంది ప్రాణాలను కాపాడారు. ఆరోగ్యం, విద్య, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. దీన్ని బట్టి సమాజ సేవకు ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. సినీ కళాకారులకు సహాయం అందించడంలో తన ఔదార్యాన్ని పలుమార్లు చాటుకున్నారు. సినీ పరిశ్రమలోనే కాదు, బయట వ్యక్తులకు కూడా ఎలాంటి ఆపద వచ్చినా సహాయం చేసేందుకు ఆయన ముందుంటారు. ఇక ఆయన చేసే గుప్తదానాలకు లెక్కేలేదు.
తన మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలై సెప్టెంబర్ 22కి 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తనను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తన సందేశాన్ని తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.
‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా ‘చిరంజీవిగా మీకు పరిచయం అయి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్‌గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ ‘ప్రేమ’. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవ మర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ...
కృతజ్ఞతలతో
మీ
చిరంజీవి
![]() |
![]() |