![]() |
![]() |

కొందరు నటులు వయసుతో సంబంధం లేకుండా సినిమా కోసం సాహసాలు చేస్తుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అలాంటి సాహసమే చేశారు. 70 ఏళ్ళ వయసున్న ఆయన.. ఓ షూటింగ్ లొకేషన్ లోకి వెళ్ళడం కోసం గోడ దూకారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం షూట్ జరుగుతోంది. ఈ లొకేషన్ లోకి ఎంటరవ్వడం కోసమే అనుపమ్ ఖేర్ ఓ విన్యాసం చేశారు.
ఫౌజిలో అనుపమ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ షూట్ కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. అయితే లొకేషన్ కి కారులో వెళ్ళిన ఆయనకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సరైన దారిలో వెళ్ళకపోవడంతో.. చివరికి గోడ దూకాల్సి వచ్చింది.

దీనికి సంబంధించిన వీడియోను అనుపమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "నా 40 ఏళ్ల సినిమా ప్రయాణంలో నేను నా షూటింగ్ లొకేషన్లలోకి వివిధ మార్గాల ద్వారా ప్రవేశించాను. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఉండటమే కాకుండా చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది. ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా డ్రైవర్ సాహసోపేతంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మేము ఒక అడవి లాంటి ప్రదేశంలోకి ప్రవేశించి, ఆపై ఒక డెడ్ ఎండ్ కు చేరుకున్నాము. కారును రివర్స్ చేయలేకపోయాము. తరువాత ఏమి జరిగిందో చూడండి." అని రాసుకొచ్చిన అనుపమ్.. నిచ్చెన సాయంతో గోడ ఎక్కి దూకిన వీడియోను పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో 70 ఏళ్ళ వయసులో అనుపమ్ డెడికేషన్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
![]() |
![]() |