![]() |
![]() |
చిన్న వయసు నుంచే సినిమాల్లో నటిస్తూ.. అందర్నీ నవ్విస్తూ ఇప్పుడు హీరోగా ఎదిగిన మాస్టర్ భరత్ ఇంట విషాదం చోటు చేసుకుంది. భరత్ తల్లి కమలాసిని మే 18 ఆదివారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కమలాసిని మరణ వార్త తెలుసుకున్న భరత్ కుటుంబ సభ్యులు చెన్నయ్‌లోని వారి నివాసానికి చేరుకున్నారు. అలాగే కొందరు సినీ ప్రముఖులు కూడా భరత్ నివాసానికి వెళ్లి కమలాసిని భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న కొందరు సినీ ప్రముఖులు భరత్‌కి ఫోన్ చేసి ధైర్యం చెబుతూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. భరత్ తెలుగులోనే కాదు, తమిళ సినిమాల్లో కూడా నటించాడు. దీంతో కోలీవుడ్ ప్రముఖులు కూడా అతని తల్లి మృతి పట్ల సానుభూతిని తెలియజేస్తున్నారు. కొందరు ఇంటికి వెళ్లి భరత్‌ను పరామర్శిస్తున్నారు.
9 ఏళ్ళ వయసులో చిరంజీవి సినిమా ‘అంజి’ ద్వారా బాలనటుడిగా పరిచయమైన భరత్ చాలా తక్కువ సమయంలో ప్రేక్షకుల్ని తన కామెడీతో, పంచ్ డైలాగులతో ఆకట్టుకొని బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. బాలనటుడిగా సుమారు 80 సినిమాల్లో నటించాడు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన వెంకీ, రెడీ, ఢీ, కింగ్ వంటి సినిమాలు అతనికి చాలా మంచిపేరు తెచ్చాయి. కమెడియన్స్ ఎంత మంది వున్నా తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్‌ని క్రియేట్ చేసుకొని డైలాగ్ డెలివరీలోగానీ, బాడీ లాంగ్వేజ్‌లోగానీ డిఫరెన్స్ చూపిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే అందరు బాలనటులకు వచ్చే సమస్యే భరత్‌కీ వచ్చింది. ఒక వయసు వచ్చేసరికి బాలనటుడికి ఎక్కువ, హీరోకి తక్కువ అనిపిస్తారు. దాంతో సినిమా అవకాశాలు కూడా తగ్గుతాయి. భరత్‌కి కూడా అదే పరిస్థితి రావడంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని కాస్త స్లిమ్‌గా మారి రీ ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ఇటీవల గోపీచంద్ హీరోగా వచ్చిన విశ్వం చిత్రంలో కనిపించాడు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో భరత్‌కి ఎంతో మంది శ్రేయోభిలాషులు ఉన్నారు. దీంతో అతని తల్లి మరణం పట్ల ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
![]() |
![]() |