![]() |
![]() |
ఒక సినిమా ప్రేక్షకుల వరకు రావాలంటే కొన్ని వందల మంది కృషి చెయ్యాల్సి ఉంటుంది. తను సినిమాకి పెట్టిన డబ్బు నిర్మాతకు తిరిగి రావాలన్నా, లాభాలు తెచ్చిపెట్టాలన్నా ఎలాంటి అవాంతరాలు లేకుండా సినిమా రిలీజ్ అవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాత లాభాలకు గండిగొడుతున్న అతి పెద్ద సమస్య పైరసీ. సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హెచ్‌డి క్వాలిటీ ప్రింట్ ఆల్‌లైన్‌లో దర్శనమిస్తోంది. ఒకప్పుడు పైరసీ అంటే ఏదో ఒక థియేటర్‌లో కెమెరాతో షూట్ చేసి దాన్ని సీడీలుగా మార్కెట్‌లోకి తీసుకొచ్చేవారు. అయితే అది అంత క్వాలిటీగా ఉండేది కాదు. కానీ, ఇప్పుడా అవసరం లేకుండా డైరెక్ట్‌గా హై క్వాలిటీ ప్రింట్ అందుబాటులోకి వచ్చేసరికి సినిమాకి మరింత నష్టం జరుగుతోంది. నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పైరసీని కట్టడి చేయడం అనేది అసాధ్యంగా మారిపోయింది. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ పైరసీ ఏ సినిమాకి ఏ స్థాయిలో నష్టం చేకూరుస్తుందో చెప్పలేని పరిస్థితి. సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి తీసిన సినిమా ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఒకపక్క, పైరసీ వల్ల తమ సినిమా ఏమైపోతుందోననే ఆందోళన మరోపక్క నిర్మాతలకు కునుకు పట్టకుండా చేస్తోంది.
కొన్నాళ్ళ క్రితం చిన్నస్థాయిలో మొదలైన ఈ పైరసీ తాజాగా విడుదలైన సల్మాన్‌ఖాన్ సినిమా సికందర్‌తో తారాస్థాయికి చేరుకుంది. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత పైరసీ ప్రింట్ బయటికి వస్తుంది. కానీ, ఈ సినిమా విషయంలో మరోలా జరిగింది. విడుదలకు కొన్ని గంటల ముందే హెచ్‌డి క్వాలిటీ ప్రింట్ బయటికి రావడంతో నిర్మాతలు షాక్ అయ్యారు. గత ఏడాది మలయాళ సినిమాలతో ప్రారంభమైన ఈ తరహా పైరసీ ఆ తర్వాత తమిళ్, కన్నడ, తెలుగు సినిమాలకు పాకిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలను సైతం టార్గెట్ చేస్తూ నిర్మాతలకు ఛాలెంజ్ విసురుతున్నారు పైరసీదారులు. గేమ్ ఛేంజర్, తండేల్, డాకు మహారాజ్, పుష్ప 2, కంగువ, సూక్ష్మదర్శిని వంటి సినిమాలు పైరసీ బారినపడడంతో రాబోయే రోజుల్లో రిలీజ్ కానున్న భారీ సినిమాల నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాది మే నుంచి భారీ బడ్జెట్ సినిమాలు వరసగా రిలీజ్ కాబోతున్నాయి. వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలు పైరసీదారులకు కాసుల వర్షం కురిపించబోతున్నాయి. హరిహరవీరమల్లు, విశ్వంభర, మిరాయ్, వార్ 2, కన్నప్ప వంటి పదికి పైగా సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. మరి రాబోయే ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు నిర్మాతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పైరసీ నెట్‌వర్క్ అంతా విదేశాల నుంచే జరుగుతోంది అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, సినిమా యూనిట్‌తో సంబంధం లేకుండా హెచ్‌డి క్వాలిటీ ప్రింట్ బయటికి ఎలా వస్తోంది అనేది పెద్ద ప్రశ్న. మొదట ఈ విషయాన్ని పరిశోధించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సినిమా ఎలా వచ్చింది అని చెక్ చేసుకునేందుకు నిర్మాత దగ్గర ఉండే వెర్షన్, విఎఫ్‌ఎక్స్ కోసం ఇచ్చే వెర్షన్, ఎడిటింగ్ రూమ్.. ఇలా అనేక మార్గాల్లో కాపీ బయటికి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎక్కడ తప్పు జరుగుతోంది అనేది తెలుసుకుంటే దానికి బాధ్యులు ఎవరు అనేది గుర్తించడం సులభం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి హీరోలు, దర్శకనిర్మాతల్లో చిత్తశుద్ది లోపించడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. గత 20 సంవత్సరాలుగా పైరసీపై వీరంతా గొంతెత్తుతున్నప్పటికీ దాన్ని ఒక ప్రణాళికగా చేయడంలో విఫలమవుతున్నారు. ఇప్పటివరకు పైరసీకి సంబంధించి జరిగిన ప్రెస్‌మీట్లను పరిశీలిస్తే వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే మీడియాలో కనిపిస్తున్నారు. వారి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత దాని గురించి వారు పట్టించుకోరు. ఆ తర్వాత మరో నిర్మాత దాన్ని కొనసాగిస్తారు. ఈ విషయంలో నిర్మాతల మధ్య ఐకమత్యం లోపించడం వల్ల కూడా సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. తమ సినిమా రిలీజ్‌కి రానప్పుడు తామెందుకు ఆ విషయం గురించి మాట్లాడాలి అనే ధోరణి నుంచి నిర్మాతలు బయటికి వచ్చి సమిష్టిగా పైరసీపై పోరాడినపుడే తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంది.
![]() |
![]() |