Home  »  News  »  తెలుగు సినిమారంగంలో కృష్ణవేణిగారిది ఓ సువర్ణాధ్యాయం - వెంకయ్యనాయుడు

Updated : Mar 2, 2025

చలన చిత్ర నటిగా, నిర్మాతగా, నేపద్య గాయనిగా శోభనచల స్టూడియో అధినేతగా శ్రీమతి కృష్ణవేణిగారికి తెలుగు సినిమారంగంలో ఓ సువర్ణ అధ్యాయం, మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకొని తెలుగు సినిమారంగంలో బహుముఖాలుగా ఎదిగిన నటీమణి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీమతి కృష్ణవేణి సంస్మరణ సభ హైదరాబాద్, ఫిలింనగర్ లో ఆదివారం రోజు జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆ నాటి నటీమణులందూ ప్రతిభావంతులేనని, నటనతో పోటు పాటలను కూడా స్వయంగా పాడుకునేవారని కృష్ణవేణి గారు విలక్షణమైన నటి అని అన్నారు. 

1949లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మనదేశం చిత్రంలో నందమూరి తారకరామారావును పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి గారిదేనని, అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో కీలుగుఱ్ఱంతో స్టార్ స్టేటస్ కూడా మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతుల వల్లనే వచ్చిందని వెంకయ్యనాయుడు ఈ సదంర్భంగా గుర్తు చేశారు.మనదేశం వజ్రోత్సపు వేడుకలు విజయవాడలో జరిగినప్పుడు శ్రీమతి కృష్ణవేణి పాల్గొన్నారని ఆమెను సత్కరించే అవకాశం తనకు వచ్చిందని వెంకయ్యనాయుడు చెప్పారు. 102 సంవత్సరాల పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి ఎందరో నటీనటులకు ఆదర్శంగా, మార్గదర్శకంగా కృష్ణవేణి ఉన్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. కృష్ణవేణమ్మ జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ భగీరథ అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ని రూపొందించారని ఈ సందర్భంభా భగీరథను వెంకయ్యనాయుడు అభినందిం చారు. ఎన్.టి.ఆర్. కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ ఎన్.టి. రామారావును సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ అంటే మా అందరికీ ఎంతో అభిమానమని, అందుకే ఆమె సంస్మరణ దినోత్సవాన్ని ఎన్.టి.ఆర్. కమిటీ సభ్యులు పూనుకొని చేయటం జరిగిందని చెప్పారు. నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ మాట్లాడుతూ తమ తండ్రిని సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ సంస్మరణ సభలో తాము కూడా భాగస్వాములైనందుకు గర్విస్తున్నామని ఆమె అంటే నందమూరి వంశాభిమానులందరికీ అభిమానమని చెప్పారు.

అక్కినేని రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ మీర్జాపురం రాజావారు, కృష్ణవేణి గారంటే తమ కుటుంబానికి ఎంతో అభిమానమని, తన తండ్రి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్.ను సినిమా రంగానికి వీరిద్దరే పరిచయం చేయటం అదొక చరిత్ర అని చెప్పారు. ఇంకా ఈ సభలో మాగంటి మురళీమోహన్, డా. పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాతలు కె.ఎస్. రామారావు, కైకాల నాగేశ్వరరావు, తుమ్మల ప్రసన్న కుమార్, కాట్రగడ్డ ప్రసాద్, రోజా రమణి, పూర్ణ విశ్వనాథ్, గుమ్మడి గోపాలకృష్ణ, అక్కినేని వెంకట్, అక్కినేని నాగసుశీల తదితరులు ప్రసంగించారు. శ్రీమతి కృష్ణవేణి సంస్మరణ సభకు తెలుగు సినిమారంగలో నటీనటులు, సాంకేతిక నిపుణులు తరలివచ్చి ఆమెకు నివాళులు అర్పించారు. 
కృష్ణవేణమ్మ మునిమనవరాలు డా. సాయిప్రియ జాస్తి వందన సమర్పణ చేశారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.