![]() |
![]() |
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల జరుగుతున్న బీభత్సం చూస్తూనే ఉన్నాం. మునుపెన్నడూ లేని విధంగా అనేక ప్రాంతాలు వరద ఉధ్ధృతి వల్ల తీవ్రంగా నష్టపోయాయి. వేల కుటుంబాలు నిరాశ్రయులై దిక్కు తోచని స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం, అధికారులు బాధితులను ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు సహాయం చేసేందుకు మొదట ముందుకు వచ్చేది సినీ పరిశ్రమ. తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సందర్భాల్లో రాష్ట్రంలో ప్రకృతి బీభత్సం సృష్టించినపుడు ప్రజలను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. ఇటీవల కేరళలో జరిగిన ఘోర ప్రమాదానికి ప్రాంతీయ భేదం లేకుండా తెలుగు హీరోలు కూడా స్పందించి భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందించారు.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా రూ. 50 లక్షల చొప్పున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నాను’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అంటే రెండు రాష్ట్రాలకు కలిపి ఎన్టీఆర్ రూ. 1 కోటి అందిస్తున్నారు.
50 సంవత్సరాలుగా చిత్ర నిర్మాణ రంగంలో ఉన్న వైజయంతి మూవీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ తమకు ఎంతో చేసిందని, ఆ రుణం తీర్చుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని వైజయంతి మూవీస్ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు ప్రకటించారు.
![]() |
![]() |