![]() |
![]() |
టాలీవుడ్ డైరెక్టర్స్‌లో పూరి జగన్నాథ్‌ది ఒక డిఫరెంట్ స్కూల్. అతని సినిమాలు విభిన్నంగా ఉంటాయి. అతని సినిమాల్లోని హీరోలు విచిత్రంగా బిహేవ్ చేస్తూ డోంట్ కేర్ అన్నట్టు ఉంటారు. పూరి మాట్లాడే తీరు చూస్తుంటే ఆ సినిమాల్లోని హీరోల లక్షణాలన్నీ అతనికి ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక సినిమా అనుకున్న దగ్గర నుంచి అది పూర్తయ్యేవరకు ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోకుండా ఎంతో జాలీగా షూటింగ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో సినిమాని ఫాస్ట్‌గా పూర్తి చెయ్యడంలో పూరిదే ఫస్ట్ ప్లేస్. దేన్నీ సీరియస్‌గా తీసుకోని పూరి.. ఫైనాన్షియల్ విషయాల్లో కూడా అదే ధోరణితో వెళ్లడం వల్ల భారీగా నష్టపోయారు. డైరెక్టర్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలో నమ్మిన వ్యక్తే అతనికి వెన్నుపోటు పొడిచాడు. ఫలితంగా రూ.85 కోట్లు నష్టపోయానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు పూరి. అప్పటివరకు సంపాదించిన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. చివరికి తన దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉన్న పెంపుడు జంతువుల్ని సైతం పోషించలేని స్థితికి వెళ్ళిపోయారు. అయితే ఒకపక్క సినిమాలు చేస్తున్నారు, కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూనే ఉన్నారు. కానీ, అప్పటివరకు ఉన్న అప్పులకు ఆ డబ్బు అలా తరలి వెళ్లిపోయేది. అలాంటి పరిస్థితిని సైతం ఎంతో మనోధైర్యంతో ఎదుర్కొన్నారు పూరి. అప్పటివరకు ఉన్న అప్పుల్ని తీర్చుకుంటూ మళ్ళీ ఆస్తుల్ని కూడబెట్టారు.
పూరి జగన్నాథ్ కెరీర్ ఎప్పుడూ అప్ అండ్ డౌన్స్‌లోనే నడుస్తూ ఉంటుంది. ఒక సూపర్‌హిట్ వచ్చిందంటే దాని వెంటే ఓ రెండు ఫ్లాప్స్ వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన టెంపర్ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ వెంటనే ఓ నాలుగు ఫ్లాప్స్ వచ్చాయి. నందమూరి బాలకృష్ణతో చేసిన పైసా వసూల్ ఎబౌ ఏవరేజ్ సినిమాగా పరిమితమైన కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత కొడుకు ఆకాష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మెహబూబా డిజాస్టర్ అయింది. దాంతో ఆర్థికంగా మళ్ళీ ఒడిదుడుకులు వచ్చాయి. అయినా ఆ తర్వాతి సంవత్సరమే రామ్ పోతినేని హీరోగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయం సాధించింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమా 85 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో పూరికి కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఆకాష్‌ను ఎలాగైనా హీరోగా నిలబెట్టాలన్న తపనతో మరోసారి రొమాంటిక్ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది.
ఒక పక్క సినిమాలు ఫ్లాప్ అవుతున్నా తన సొంత బేనర్‌లోనే సినిమాలు చేస్తూ వచ్చారు పూరి. ఆ క్రమంలోనే అతనికి అత్యంత భారీ నష్టాన్ని తెచ్చిన సినిమా విజయ్ దేవరకొండతో చేసిన లైగర్. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు రూ.125 కోట్లు బడ్జెట్ అయింది. అప్పటికి విజయ్ దేవరకొండకు వున్న క్రేజ్ దృష్ట్యా ఆ స్థాయిలో సినిమాను నిర్మించారు. కానీ, ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచి కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో తనకు సూపర్‌హిట్ ఇచ్చి నిలబెట్టిన ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్‌నే నమ్ముకొని దానికి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని సొంత బేనర్‌లోనే నిర్మించారు. ఏ సినిమానైనా ఎంతో ఫాస్ట్‌గా పూర్తి చేసి రిలీజ్ చేస్తాడని పూరికి పేరుంది. కానీ, ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. షూటింగ్ దగ్గర నుంచి రిలీజ్ వరకు ఎంతో జాప్యం జరిగింది. అన్నీ పూర్తి చేసి ఆగస్ట్ 15న చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఎప్పటిలాగే పూరి కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా నిలిచింది డబుల్ ఇస్మార్ట్. దీంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చేందుకు శంషాబాద్‌లో ఉన్న ఓ కాస్ట్‌లీ ప్రాపర్టీని అమ్మేశారని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ముందు రోజు పూరి ఆఫీసులో దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని సమాచారం. పాత అప్పులు క్లియర్ చేస్తేనే కొత్త సినిమాను రిలీజ్ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకే శంషాబాద్‌లోని ఆ ప్రాపర్టీని రూ.18 కోట్లకు అమ్మారట. అంతేకాదు డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేసిన నిరంజన్‌రెడ్డి బాగా నష్టపోయారు. ఆ డబ్బుని కూడా పూరి తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం మరో ప్రాపర్టీని తాకట్టు పెట్టాలన్న ఆలోచనలో పూరి ఉన్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్‌లో ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్న డైరెక్టర్ పూరి తప్ప మరెవ్వరూ లేరన్నది వాస్తవం. పాత తరం డైరెక్టర్ అయిన కె.మురళీమోహన్‌రావు.. పూరి జగన్నాథ్‌కి రెండు సలహాలు ఇచ్చారట. అదేమిటంటే.. అవకాశాలు ఎలా రాబట్టుకోవాలి, కెరీర్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఒకటైతే.. వచ్చిన డబ్బును వృధా చేయకుండా జాగ్రత్త చేసుకోవాలనేది రెండో సలహా. మొదటి సలహా పాటించిన పూరి టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు. కానీ, రెండో సలహాను పెడచెవిన పెట్టారు. అందుకే ఇలాంటి ఆర్థికపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని తెలుస్తోంది. ఇంతకుముందు టాప్ హీరోలతో సినిమాలు చేసిన పూరీకి మళ్ళీ వాళ్ళు అవకాశం ఇస్తారన్న నమ్మకం అతనికి కూడా లేదు. మరి ఈ పరిస్థితిలో పూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
![]() |
![]() |