![]() |
![]() |
ఇటీవల ప్రభాస్‌పై బాలీవుడ్ హీరో అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ ఓ జోకర్‌లా ఉన్నాడని అర్షద్ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీలోని ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘కల్కి’ సినిమాలోని ఓ సీన్‌ను పోస్ట్ చేస్తూ ‘ఈ ఒక్క సీన్ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంతో సమానం’ అంటూ పోస్ట్ పెట్టాడు. దానిపై నాగ్ అశ్విన్ స్పందిస్తూ ‘టాలీవుడ్, బాలీవుడ్ అని విడదీసి మాట్లాడడం సరికాదు. ఇలా ఒక దానితో మరోదాన్ని పోలుస్తూ మనం వెనక్కి వెళ్లొద్దు. అందరం ఒక ఇండస్ట్రీకి చెందినవాళ్ళమే. అర్షద్ కాస్త హుందాగా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినా నో ప్రాబ్లమ్. అతని పిల్లల కోసం మేము ‘కల్కి’ బుజ్జి బొమ్మలు పంపిస్తాం. ఇక రెండో భాగం కోసం ఇంకా కష్టపడతాను. ప్రభాస్‌ను ఇంకా బాగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంతో మంది మనల్ని ద్వేషిస్తారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లాలి అంటూ ప్రభాస్ కూడా ఇదే విషయం చెబుతారని గుర్తు చేసుకున్నారు.
అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తూ బాలీవుడ్ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. ‘తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు అందరికీ ఉంది. అయితే అర్షద్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రభాస్‌ని తక్కువ చేసేలా, వ్యతిరేకతను పెంచేలా ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా చేస్తారని ఆశిస్తున్నాం. భాష, ప్రాంతంతో సంబంధం లేదు. మనమంతా ఒక కుటుంబం. ఈ ఐక్యతను కాపాడుకుందాం’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు విష్ణు.
![]() |
![]() |