![]() |
![]() |
భారతీయ సినిమాకి సంబంధించి తొలి ఆస్కార్ అందుకున్న కళాకారుడిగా ఎ.ఆర్.రెహమాన్ చరిత్ర సృష్టించారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంలోని ‘జయహో’ పాటకి ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ లభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ పాటకి ఉపయోగించిన ట్యూన్ మాత్రం రెహమాన్‌ది కాదు అనే కొత్త విషయాన్ని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఒక యూ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది నమ్మశక్యం కాని విషయమే అయినప్పటికీ ఆ ట్యూన్ చేసిన సుఖ్విందర్ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని తనకు చెప్పాడని రామ్‌గోపాల్‌వర్మ వివరించారు. అసలు ఈ ట్యూన్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఒకసారి చూద్దాం.
బాలీవుడ్‌లో సుభాష్ ఘాయ్‌కి డైరెక్టర్‌గా ఎంత పేరుందో అందరికీ తెలుసు. తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు, బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. ఆయన చేసిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. సుభాష్ ఘాయ్, ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్‌లో తాళ్, కిస్నా, యువరాజ్ చిత్రాలు వచ్చాయి. యువరాజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. ఈ సినిమాకి సంబంధించి సుభాష్, రెహమాన్ మధ్య జరిగిన ఓ ఘటన వల్ల రెహమాన్ సినిమా నుంచి వైదొలగడంతో ఇస్మాయిల్ దర్బార్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం మళ్ళీ రెహమాన్‌ని పిలిపించి అతనితోనే చేయించారు. సకాలంలో ట్యూన్స్ ఇవ్వడు అని రెహమాన్‌కి పేరుంది. దానికి తగ్గట్టుగానే యువరాజ్ చిత్రం విషయంలో కూడా చేశారు. సినిమాలోని పాటల కోసం సెట్స్ వేసుకొని సిద్ధంగా ఉన్న సుభాష్‌కి ట్యూన్స్ అందించలేకపోయాడు రెహమాన్. దాంతో రెహమాన్‌కి ఘాటుగా ఓ మెయిల్ పెట్టారు సుభాష్. ఆ సమయంలో రెహమాన్ లండన్‌లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పనిలో ఉన్నారు. ఆ తర్వాత సుభాష్‌కి ఫోన్ చేసిన రెహమాన్.. తాను ముంబాయి వస్తున్నానని, సుఖ్విందర్ సింగ్ స్టూడియోలో కలుద్దామని చెప్పారు.
రెహమాన్ చెప్పినట్టుగానే సుఖ్విందర్ సింగ్ స్టూడియోకి వెళ్ళారు సుభాష్. అప్పటికి రెహమాన్ అక్కడికి రాలేదు. సుభాష్ వెళ్ళే సమయానికి సుఖ్విందర్ ఒక ట్యూన్ చేసే పనిలో ఉన్నారు. ‘రెహమాన్ మీ సినిమా కోసం ఒక ట్యూన్ చెయ్యమన్నారు. అదే చేస్తున్నాను’ అని చెప్పాడు సుఖ్విందర్. దీంతో సుభాష్‌కి విపరీతమైన కోపం వచ్చింది. ఆ టైమ్‌లోనే రెహమాన్ అక్కడికి వచ్చారు. సుఖ్విందర్ చేసిన ట్యూన్ విన్నారు. ‘ఈ ట్యూన్ నాకు బాగా నచ్చింది. మీకు ఓకేనా?’ అని సుభాష్‌ని అడిగారు రెహమాన్. దాంతో ఆయన కోపం కట్టలు తెంచుకుంది. ‘నీకు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేది.. సుఖ్విందర్‌తో ట్యూన్స్ ఇస్తాడని కాదు. అతనితో చేయించుకోవడం నాకు తెలీదా?’ అంటూ బిగ్గరగా రెహమాన్‌పై చిందులు తొక్కారు.
దానికి రెహమాన్ కూడా గట్టిగానే సమాధానమిస్తూ ‘ట్యూన్ ఎవరిదైనా మ్యూజిక్ బై ఎ.ఆర్.రెహమాన్ అనే పేరుకే మీరు నాకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇంతకుముందు తాళ్ చిత్రానికి ట్యూన్స్ ఎవరు చేశారో మీకు తెలుసా? నా డ్రైవర్ చెయ్యొచ్చు, నా తోటమాలి చెయ్యొచ్చు. ఎవరు చేసినా నా ద్వారా బయటికి వస్తున్నాయి. దానికే మీరు నాకు డబ్బు ఇస్తున్నారు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు రెహమాన్. ఆ సమయంలోనే యువరాజ్ చిత్రానికి ఇస్మాయిల్ దర్బార్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి రెహమాన్ మేనేజర్.. సుఖ్విందర్‌కి రూ.5 లక్షల చెక్ ఇచ్చి ‘మీరు ఒక ట్యూన్ చేశారట కదా. దానికి సంబంధించిన షేర్ ఇది’ అని చెప్పారు.
ఆ ట్యూన్ ఏమిటో తెలుసా? ‘స్లమడాగ్ మిలియనీర్’లోని ‘జయహో’ సాంగ్. ఆ పాటను సుఖ్విందర్ సింగే పాడారు. తన కెరీర్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన సుభాష్‌ఘాయ్‌కి ‘జయహో’ ట్యూన్ నచ్చలేదు. ఆ కారణంగా అది ‘స్లమడాగ్ మిలియనీర్’ చిత్రానికి వెళ్లింది. ‘జయహో’ పాటకు సంబంధించి ట్యూన్ మాత్రమే సుఖ్విందర్‌ది. అయితే ఆ పాటకు ఆర్కస్ట్రయిజేషన్‌తో పాటు మ్యూజిక్‌ని ఎరేంజ్ చేసింది, కండక్ట్ చేసింది మాత్రం రెహమానే. ఆ విధంగా రెహమాన్‌కి ‘జయహో’ పాట ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది.
![]() |
![]() |