![]() |
![]() |

తారాగణం: చాందిని చౌదరి, భరత్ రాజ్, వశిష్ట సింహా, అషు రెడ్డి, గోపరాజు రమణ తదితరులు
సంగీతం: కీర్తన శేష్, నీలేష్ మాండలపు
డీఓపీ: ఎస్.వి. విశ్వేశ్వర్
ఎడిటర్: సృజన
దర్శకత్వం: ప్రకాష్ దంతులూరి
నిర్మాత: నవదీప్, పవన్ గోపరాజు
బ్యానర్: సి స్పేస్, ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్
విడుదల తేదీ: జూన్ 14, 2024
'కలర్ ఫోటో', 'గామి' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి.. ఇప్పుడు 'యేవమ్' అనే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె పోలీస్ పాత్ర పోషించడం విశేషం. మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఎస్ఐ గా జాయిన్ అవుతుంది సౌమ్య(చాందిని చౌదరి). ఆ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గా అభిరాం (భరత్ రాజ్) ఉంటాడు. డ్యూటీనే ప్రపంచం అన్నట్టుగా ఉండే అభిరాంని సౌమ్య ఇష్టపడుతుంది. మరోవైపు యుగంధర్(వశిష్ట సింహా) అనే వ్యక్తి సినీ హీరోల పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం అభిరాంకు సవాల్ గా మారుతుంది. ఈ క్రమంలో యుగంధర్ ని పట్టుకోవడం కోసం ఒక సాధారణ యువతిలా సౌమ్య ఒంటరిగా వెళ్తుంది. యుగంధర్ దొరికాడా? అసలు అతను ఎవరు? సైకో మారడానికి కారణమేంటి? యుగంధర్ కి, అభిరాంకి మధ్య సంబంధం ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఒక నేరం జరగడం.. నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఊహించని ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయవచ్చు. ఆ పరంగా చూస్తే.. ఈ జానర్ ని సెలెక్ట్ చేసుకోవడంలోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
సౌమ్య పోలీస్ గా జాయిన్ అవ్వడం, సౌమ్య-అభిరాం మధ్య వచ్చే సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. హీరోల పేరుతో విలన్ అమ్మాయిలను ట్రాప్ చేసే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు మెప్పించాయి. విలన్ ని పట్టుకోవడానికి పోలీసులు చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ నడిచింది. విలన్ ఎవరో ప్రేక్షకులకి ఫస్ట్ హాఫ్ లోనే చూపించినా.. పోలీసులకు తెలీదు కాబట్టి ఎలా పట్టుకుంటారు అనేది ఆసక్తిగానే నడిపించారు. పతాక సన్నివేశాలు మెప్పించాయి. అయితే కొన్ని సీన్స్ సాగదీతగా అనిపించాయి. స్క్రీన్ ప్లై మరింత టైట్ గా రాసుకున్నట్లయితే అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.
టెక్నికల్ ఈ సినిమా బాగానే ఉంది. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
సౌమ్య అనే పోలీస్ పాత్రలో చాందిని చక్కగా రాణించింది. యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది. భరత్‌రాజ్, వశిష్ట సింహా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అషు రెడ్డి, గోపరాజు రమణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా...
క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి 'యేవమ్' నచ్చే అవకాశముంది.
రేటింగ్: 2.5/5
![]() |
![]() |