![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో తన తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం రూ.5 కోట్ల విరాళాన్ని చెక్ రూపంలో మరో సోదరుడు నాగబాబు చెంతనుండగా పవన్ కళ్యాణ్ కి అందించారు. 'విశ్వంభర' షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదిక కావడం విశేషం.
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి 'విశ్వంభర' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ నిర్మిస్తోంది. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో ప్రస్తుతం చిత్ర షూటింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం నాగబాబుతో కలసి లొకేషన్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కి.. చిరంజీవి ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు. అలాగే చిరంజీవి పాదాలకు పవన్ కళ్యాణ్ నమస్కరించారు. పవన్ కళ్యాణ్ కి చిరంజీవి చెక్ అందించిన అనంతరం.. సోదరులు ముగ్గురూ కొంత సేపు సంభాషించుకున్నారు.

అయితే 'విశ్వంభర' లొకేషన్ లో చిరంజీవి చెక్ అందించడంతో.. ఈ సినిమాలో ఆయన లుక్ రివీల్ అయిపోయింది. ఆయన హెయిర్ స్టైల్, గెటప్, లుక్ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేస్తున్నాయి. అలాగే చిరంజీవి ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ కి అండగా చిరంజీవి నిలవడం, మరోవైపు 'విశ్వంభర'లో లుక్ అదిరిపోవడంతో.. మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
![]() |
![]() |