![]() |
![]() |

తమిళ నటుడు డేనియల్ బాలాజీ మరణాన్ని మరువకముందే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 64 ఏళ్ళ విశ్వేశ్వరరావు.. మంగళవారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు.. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి.. తెలుగు, తమిళ భాషల్లో 300 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ వంటి నాటి తరం అగ్రతారలు మొదలుకొని.. నేటి తరం అగ్రతారల వరకు ఎందరితోనే స్క్రీన్ పంచుకున్నారు.
తన కామెడీ టాలెంట్ తో.. తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన విశ్వేశ్వరరావు మృతి అందరినీ షాక్ కి గురి చేసింది. ఎందుకంటే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయమే చాలామందికి తెలియదు. గత రెండేళ్లుగా విశ్వేశ్వరరావు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కొన్నేళ్లుగా సినిమాలు చేయకపోవడం, చెన్నైలో నివసిస్తుండటంతో.. ఆయనకు క్యాన్సర్ సోకిన విషయం పెద్దగా ఎవరికీ తెలియలేదు. ఆఖరికి ఆయన మృతి వార్త కూడా కొన్ని గంటలు ఆలస్యంగానే తెలిసింది. సోషల్ మీడియా యుగం కాబట్టి.. విశ్వేశ్వరరావు మరణించిన వార్త కాస్త ఆలస్యంగానైనా ప్రేక్షకులకు తెలిసింది. లేదంటే ఈ వార్త ఇంకెంత ఆలస్యంగా తెలిసి ఉండేదో.
ఏది ఏమైనా విశ్వేశ్వరరావు లాంటి ప్రతిభగల హాస్యనటుడు కన్నుమూయడం తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు తీరని లోటు.
![]() |
![]() |