![]() |
![]() |

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవకు చెందినదే 'కథ వెనుక కథ' చిత్రం. యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, సునీల్, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు నటించారు. అవనీంద్రకుమార్ నిర్మించారు. ఈ చిత్రం ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే....
కథ:
డైరక్టర్ కావాలన్నది అశ్విన్ (విశ్వంత్) కల. తన మేనమామ కూతురు శైలజతో ప్రేమలో పడతాడు అశ్విన్. అయితే ఓ మంచి సినిమా తీసి హిట్ కొడితేనే తన కూతురునిచ్చి వివాహం చేస్తానని కండిషన్ పెడతాడు మేనమామ. అశ్విన్ ఎంతో మంది నిర్మాతలకు స్టోరీలు చెబుతాడు, కానీ ఎవరూ సినిమా చేయడానికి ముందుకు రారు. చివరికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణ (జయప్రకాష్) తనతో సినిమా తీయడానికి ముందుకొస్తాడు. సినిమా షూటింగ్ పూర్తయి.. రిలీజ్ దగ్గర పడే సమయంలో ప్రమోషన్స్ కి డబ్బులు అడ్జస్ట్ అవ్వడం లేదని నిర్మాత షాక్ ఇస్తాడు. దీంతో అశ్విన్ డిప్రెషన్ కి లోనవుతాడు. ఇంతలో అశ్విన్ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు కనపడకుండా పోతారు. మిస్సైన ఐదుగురిలో రాజు చనిపోతాడు. రాజు ఎలా చనిపోయాడు? అసలు అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న తెర వెనుక కథ నటీనటులు ఎలా మిస్సయ్యారు? సత్య (సునీల్) అనే పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ కేసును ఛేదించే క్రమంలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? సత్య స్టోరి ఏంటి? అప్పటికే వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. దానికీ, దీనికీ సంబంధాలున్నాయా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
కథ వెనుక కథ అనే టైటిల్ లోనే మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయని అర్థమవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ అశ్విన్, ప్రొడ్యూసర్ కృష్ణ, పోలీస్ ఆఫీసర్ సత్య... వీరి ముగ్గురి జీవితాలకు సంబంధించిన కథ ఇది. ఎలాగైనా మంచి సినిమా తీసి హిట్ కొట్టాలన్న కసి డైరెక్టర్ అశ్విన్ ది. సినిమా నిర్మించాలన్న తన కూతురి కలను నెరవేర్చాలన్నది నిర్మాత పట్టుదల. తప్పు జరిగితే ఎంత దూరమైనా వెళ్లే పోలీస్ ఆఫీసర్ సత్య. కానీ వీరి జీవితాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి వారి కలలను, ఆశయాలను దెబ్బ తీస్తాయి. ఆ పరిణామాల పర్యవసానాలను దర్శకుడు ఎంతో ఉత్కంఠ భరితంగా తీశాడు.
ఒక దారుణమైన హత్యతో సినిమాను ఓపెన్ చేసిన దర్శకుడు.. అక్కడి నుంచి ప్రేక్షకులను కదలనీయకుండా లాక్ చేస్తాడు. ఆ తర్వాత హీరో విశ్వంత్ లవ్ స్టోరీతో పాటు తను డైరక్షన్ ఛాన్సుల కోసం వెతకడం, నిర్మాతలను కలవడం... సినిమా ఓకే కావడం... ఈ సినిమాలో వరుస హత్యలకు పాల్పడుతున్న గ్యాంగ్ నటించడం... ఇలా ఫస్టాప్ ను నడిపించాడు దర్శకుడు. ఆ తర్వాత అర్థాంతరంగా సినిమా ఆగిపోవడం, డైరెక్టర్ సినిమాకు బజ్ తీసుకురావాలని ప్లాన్ చేయడం, మీడియాలో ఈ సినిమా సంచలనంగా మారడం, ఈ క్రమంలో హీరో అసలు ఏం జరుగుతుందోనని తెలుసుకొని ఈ వరుస హత్యలకు కారకులు ఎవరనేది ఛేదించడం... ఇలా కథ అనేక మలుపులతో, ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుంది.
ఫస్టాఫ్ కొంత స్లో గా సాగినా సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. ప్రీ క్లై మాక్స్ లో వచ్చే సునీల్ కి సంబంధించిన సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో కథనం పరుగులు పెడుతుంది. పోలీస్ ఎంక్వయిరీ, హీరో సినిమా సమస్య, అమ్మాయిల హత్య లకు కారణం ఎవరు, ఆ గ్యాంగ్ కి లీడర్ ఎవరు, అని అనేక మలుపులు తిరుగుతుంది. అన్ని ప్రశ్నలకు జవాబుగా ఆఖరిలో వెంట వెంటనే వచ్చే ట్విస్ట్ లు షాక్ ఇస్తాయి. దర్శకుడు మొదట నుంచి ఈ సినిమా సస్పెన్స్ గా థ్రిల్లింగ్ గా నడిపించాలని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగా గానే చాలా మలుపులు రాసుకున్నాడు. ప్రేక్షకుడుని ఆఖరి వరకు సినిమా చూసేలా చేసాడు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. డైలాగులు బాగానే ఉన్నాయి.
నటీనటులు పనితీరు:
దర్శకుడు కావాలనే తపన ఉన్న యువకుని పాత్రలో విశ్వంత్ బాగా నటించాడు. ఓ వైపు కెరీర్, మరో వైపు ప్రేమించిన యువతిని సొంతం చేసుకోవాలన్న తపన ఉన్న ఓ బాధ్యతాయుతమైన యువకుని పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఇందులో కమెడియన్ సునీల్ క్యారెక్టర్ చాలా సర్ ప్రైజ్ ఇస్తుంది. వైవిధ్యమైన పాత్రలో సునీల్ కనిపించి మెప్పించాడు. సినీ నిర్మాతగా జయప్రకాశ్ ఆకట్టుకున్నాడు. సత్యం రాజేష్, రఘుబాబు, మధునందన్, భూపాల్, ఖయ్యుం తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా..
సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది.
రేటింగ్: 2.75/5
![]() |
![]() |