![]() |
![]() |
సినిమా తారలకు ప్రేక్షకులే దేవుళ్ళు. వాళ్ళు లేకపోతే సినిమాకి, సినిమా తారలకు మనుగడ లేదు. ఇక అభిమానులు లేకపోతే స్టార్స్‌కి కిక్ ఉండదు. వాళ్ళు చూపించే అభిమానం వల్లే ఉత్సాహంగా పనిచేస్తారు, ఇంకా మంచి సినిమాలు చేసి ఆ అభిమానాన్ని మరింత పొందాలని ఆశిస్తారు. ఒకప్పుడు సినిమా ఒక్కటే వినోద సాధనం. దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అలాగే హీరోలను, హీరోయిన్లను అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉండేది. అప్పటి స్టార్ హీరోలకు అభిమాన సంఘాలు కూడా ఉండేవన్న సంగతి తెలిసిందే. కాలం మారింది, వినోద సాధనాలూ పెరిగాయి. దీంతో అభిమానులు కూడా తమ అభిమాన తారలను సోషల్ మీడియాలో పలకరిస్తున్నారు. తమ ఆనందాన్ని వారితో షేర్ చేసుకుంటున్నారు. అలాగే స్టార్స్ కూడా అభిమానులతో తమ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
అభిమానుల్లో కొందరు వీరాభిమానులు ఉంటారు. మరికొందరు కరడుగట్టిన అభిమానులు ఉంటారు. ఇలాంటి వారు చేసే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంతటి అభిమానాన్ని ఒక్కోసారి ఆయా స్టార్లు కూడా తట్టుకోలేరు. తమ అభిమాన తారల కోసం గుడి కట్టిన వారు ఉన్నారు. మరెన్నో సాహసాలు చేసినవారు కూడా ఉన్నారు. అలాంటి వీరాభిమానులు, కరడుగట్టిన అభిమానులు ఇప్పటి హీరోల్లో విజయ్ దేవరకొండకు మాత్రమే ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. స్టార్ హీరోని అనే భేషజానికి పోకుండా సామాన్య ప్రజలతో కలిసిపోయే మనస్తత్వం ఉన్న విజయ్ అంటే అంత అభిమానం చూపిస్తారు అతని అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా విజయ్‌కు అభిమానులు ఉన్నారు.
ఏప్రిల్ 5న విజయ్‌దేవరకొండ కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తమ హీరో కొత్త సినిమా వస్తోందంటే అభిమానులకు పండగలాంటిదే కదా. అందుకే ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు ఇటీవల అభిమానులు విజయ్ దేవరకొండను కలిసారు. అందరితోనూ సరదాగా మాట్లాడిన విజయ్ ఆ తర్వాత వారితో ఫోటోలు దిగారు. ఆ సమయంలోనే ఒక అభిమాని తను వేసిన విజయ్ దేవరకొండ పెయింటింగ్‌ను బహూకరించాడు. అది మామూలు పెయింటింగే అనుకున్నాడు విజయ్. ఆ అభిమాని తన బ్లడ్తో తన బొమ్మ వేశాడని తెలుసుకొని షాక్ అయ్యాడు. వెంటనే అతన్ని దగ్గరకు లాగి ‘అరే మెంటల్.. ఇలాంటివి చెయ్యొద్దు’ అని ప్రేమగా చెప్పాడు. ఇలాంటివి జరిగినపుడే హీరోలు ఎమోషనల్ అయిపోతుంటారు. ఆ ఎమోషన్‌లోనే ఆ అభిమానిని చిన్నగా తట్టేందుకు కూడా ప్రయత్నించాడు విజయ్. తనంటే అంతగా ఇష్టపడుతున్న ఆ అభిమానితో కాసేపు ముచ్చటించాడు విజయ్.
![]() |
![]() |