![]() |
![]() |

మూవీ : పాయుమ్ ఒలిని ఎనక్కు
నటీనటులు: విక్రమ్ ప్రభు, డాలి ధనంజయన్, వాణి భోజన్, ఆనంద్, వేల రామమూర్తి, వివేక్ ప్రసన్న తదితరులు
ఎడిటింగ్: సి.ఎస్ ప్రేమ్ కుమార్
మ్యూజిక్: సాగర్
సినిమాటోగ్రఫీ: శ్రీధర్
నిర్మాతలు: కార్తిక్ చౌదరి
కథ, దర్శకత్వం: కార్తిక్ అద్వైత్
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కొన్ని ఇతర భాషలలోని థ్రిల్లర్స్ మన తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. కార్తిక్ అద్వైత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ' అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం..
కథ:
రాత్రివేళ అరవింద్ (విక్రమ్ ప్రభు) ఆటోలో వెళ్తుంటాడు. అదే సమయంలో రోడ్డు మీద ఒకతను లిఫ్ట్ కోసం ఆటోని ఆపుతాడు. బైక్ పాడైంది. ఆడవాళ్ళున్నారని అతను రిక్వెస్ట్ చేయడంతో అరవింద్ సరేనంటాడు. ఇక కాస్త దూరం వెళ్ళగానే ఆటో ఆగిపోతుంది. ఇక ఆటోని కాస్త తోయమని డ్రైవర్ చెప్తాడు. అరవింద్ తో పాటు మిగిలిన ఇద్దరు సహాయం చేస్తుంటారు. ఇక ఆటో డ్రైవర్ ఓ ఇనుప రాడ్ ని అరవింద్ కి తెలియకుండా వేరే అతనికి ఇస్తాడు. అతను అరవింద్ కి తెలియకుండా వెళ్ళి తలపై బలంగా కొట్టడంతో అతను స్పృహ కోల్పోతాడు. అతడిని తోసుకెళ్ళి ఓ ట్రక్ లో పడేస్తారు. అసలు అతనిని అలా కొట్టి తీసుకెళ్ళిందెవరు? అరవింద్ కి ఉన్న సమస్యేంటి? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
అర్థరాత్రి ఓ వ్యక్తిని కొట్టి కిడ్నాప్ చేయడంతో.. వాళ్ళెవరు అనే క్యూరియాసిటితో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఇక అతన్ని కిడ్నాప్ చేసిందెవరో తెలుసుకోవడానికి కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో చెప్తూ గతంలోకి వెళ్తుంది. ఇక అక్కడి నుండి కథ అర్థం లేకుండా, ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ సాగుతుంది.
అరవింద్ చుట్టూ సాగే కథని హైలైట్ చేసే క్రమంలో.. అతనికి ఉన్న సమస్య, అతని ఇంటలిజెన్స్ అనే కీలకమైన అంశాలని దర్శకుడు కార్తిక్ అద్వైత్ మర్చిపోయాడు. అరవింద్ సమస్యని హైలైట్ చేస్తూ కథ రాసుకుంటే బాగుండేది.. అది వదిలేసి ఎవడో ఓ రౌడీ తను రాజకీయాలలో ఎదగాలనే కాంక్షతో చేసే హత్యలని వెలికితీసే ప్రయత్నంలో కథని పూర్తిగా మర్చిపోయాడు. ఫస్టాఫ్ మొత్తం హీరో చుట్టూ హీరోయిన్ తిరుగుతూ వారి మధ్య లవ్ ట్రాక్.. అర్థం కానీ పాటలు, అనవసరమైన స్లో సీన్లన్ని చాలానే ఉన్నాయి.
సినిమా మెయిన్ పాయింట్ ని వదిలేసి ఏం చేశాడో అన్నీ చేశాడు. ఇదే స్టోరీ లైన్ తో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అసభ్య పదజాలం లేదు. సినిమా మొత్తంలో కొన్ని సీన్లు బాగుంటాయి. ముఖ్యంగా హీరోకి ఉన్న డిఫెక్ట్ ను పోగొడుతూ వాళ్ళ నాన్న ఇచ్చే ట్రైనింగ్ మోటివేషనల్ వర్డ్స్ అన్నీ బాగుంటాయి. అయితే ల్యాగ్ సీన్లు, రొటీన్ గా సాగిన కథనం.. అరగదీసిన అవే పాత లాజిక్ లేని ఫైట్లు అన్నీ వెరసి కథని పూర్తిగా డైవర్ట్ చేశాయి. అర్థం కానిది టైటిలే కాదు సినిమా కూడా అని సాటి తెలుగు సినిమా అభిమాని అనుకునేలా చేశారు. సినిమా మొత్తంలో.. నటించిన నటీనటుల పర్ఫామెన్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయంతే. మిగతాదంతా డొల్ల. సి.ఎస్. ప్రేమ్ కుమార్ ఎడిటింగ్ బాగుంది. సాగర్ మ్యూజిక్ పెద్దగా మెప్పించలేకపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
అరవింద్ పాత్రలో విక్రమ్ ప్రభు ఒదిగిపోయాడు. జీవన్ గా ధనంజయ ఆకట్టుకున్నాడు. ఉత్ర పాత్రలో వాణి భోజన్ అభినయాన్ని ప్రదర్శించించింది. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
ఫైనల్ గా : స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా ఉన్నా.. అదే పాత కథ.
రేటింగ్ : 2/5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |