![]() |
![]() |
ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న టాప్ డైరెక్టర్స్‌లో గోపీచంద్ మలినేని ఒకరు. పక్కా మాస్ సినిమాలు తీసి ప్రేక్షకుల్ని ఆకట్టుకోగల సత్తా ఉన్న డైరెక్టర్ గోపీచంద్. ఇప్పటివరకు అతను డైరెక్ట్ చేసిన 7 సినిమాల్లో మూడు సినిమాలు రవితేజతోనే చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఎనిమిదో సినిమా కూడా రవితేజతోనే చేయడం విశేషం. మాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ అతను చేసే సినిమాలన్నీ డిఫరెంట్ ప్యాట్రన్‌లో ఉండడం మనం గమనించవచ్చు. 2010లో ‘డాన్ శీను’తో డైరెక్టర్‌గా పరిచయమైన గోపీచంద్ సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తాడని ఈ 14 సంవత్సరాల్లో అతను చేసిన 7 సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం రవితేజతో అతను చేస్తున్న సినిమా కూడా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. మార్చి 13 దర్శకుడు గోపీచంద్ మలినేని పుట్టినరోజు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అతను డైరెక్టర్‌గా ఎదిగిన క్రమం, అతను సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.
అప్పటివరకు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో ఎ.ఎ.ఆర్ట్స్ సంస్థ ‘పోలీస్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు గోపీచంద్. ఆ తర్వాత వరసగా శ్రీహరి హీరోగా నటించిన దేవా, సాంబయ్య చిత్రాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే కొనసాగాడు. అలాగే ఇ.వి.వి.సత్యనారాయణ, శ్రీను వైట్ల, మురుగదాస్ వంటి అగ్ర దర్శకుల సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. కొత్త డైరెక్టర్లకు ఎప్పుడూ అవకాశాలు ఇచ్చే రవితేజ.. గోపీచంద్‌లోని టాలెంట్‌ని గుర్తించి ‘డాన్‌శీను’ చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకి ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. రవితేజ కెరీర్‌లో ఓ బిగ్టెస్ట్ హిట్‌గా ‘డాన్‌శీను’ నిలిచింది. ఈ సినిమాను ‘బాద్‌షా.. ది డాన్’ పేరుతో బెంగాలీలో రీమేక్ చేశారు.
రెండో చిత్రంగా మలయాళంలో సూపర్‌హిట్ అయిన ‘బాడీగార్డ్’ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు గోపీచంద్. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. మూడో సినిమాగా మళ్ళీ రవితేజతోనే ‘బలుపు’ అనే చిత్రాన్ని చేశాడు. ఇది రవితేజకు, గోపీచంద్ మరో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత రామ్‌తో ‘పండగ చేస్కో’, సాయిధరమ్‌తో ‘విన్నర్’ వంటి సినిమాలు చేసినా విజయాల్ని అందుకోలేకపోయాడు. ఈ ప్రయాణంలో రవితేజతో చేసిన రెండు సినిమాలు సూపర్‌హిట్ అవ్వడంతో మరోసారి రవితేజతోనే ‘క్రాక్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది.
తన ఏడో సినిమాకి నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేసే మంచి అవకాశం వచ్చింది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా ఒక చక్కని మాస్ ఎంటర్‌టైనర్‌గా ‘వీరసింహారెడ్డి’ని రూపొందించాడు. ఈ సినిమాలో బాలయ్యను గోపీచంద్ ప్రజెంట్ చేసిన తీరు ప్రేక్షకులకు, బాలయ్య అభిమానులకు బాగా నచ్చింది. ఫలితంగా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం మరోసారి రవితేజ హీరోగా తన ఎనిమిదో సినిమాను తెరకెక్కిస్తున్నాడు గోపీచంద్. సెంటిమెంటల్‌గా రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ ప్రతిసారీ వర్కవుట్ అవుతూనే ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న నాలుగో సినిమా కూడా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ దర్శకుడు గోపీచంద్ మలినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.
![]() |
![]() |