![]() |
![]() |

టాలీవుడ్ లో కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్.. కొంతకాలంగా రూట్ మార్చి 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం' వంటి విభిన్న సినిమాలు చేశాడు. అయితే ఇప్పుడు మళ్ళీ తనకు బాగా అలవాటైన కామెడీ రూట్ లోకి వచ్చాడు. అలా నరేష్ చేసిన తాజా చిత్రమే 'ఆ ఒక్కటీ అడక్కు'. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంటోంది. "పెళ్లి ఎప్పుడు?" అనేది యువతను ఎంతగానో వేధించే ప్రశ్న. అలా ఆ ప్రశ్నను పదే పదే ఎదుర్కొనే యువకుడిగా ఈ సినిమాలో నరేష్ కనిపిస్తున్నాడు. అందరూ నరేష్ ని "పెళ్లి ఎప్పుడు?" అని అడుగుతుండటం.. చివరికి ఫరియాతో ప్రేమలో పడిన నరేష్ పెళ్లి చేసుకుందామని అడిగితే దానికి ఆమె "ఆ ఒక్కటీ అడక్కు" అని చెప్పడం వంటి.. సన్నివేశాలతో టీజర్ సరదాగా సాగింది. ఈమధ్య కామెడీ సినిమాలు బాగా తగ్గిపోతాయి. ఈ సినిమాలో కామెడీ పండితే.. నరేష్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే అవకాశముంది.
చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా సూర్య, ఎడిటర్ గా చోటా కె. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |