![]() |
![]() |

మూవీ : అయలాన్
నటీనటులు: శివ కార్తికేయన్, వెంకటేష్ సెంగుత్తువాన్, రకుల్ ప్రీత్ సింగ్, శరద్ ఖేల్కర్, ఇషా కొప్పికర్, కరుణాకరన్, యోగిబాబు తదితరులు
ఎడిటింగ్: రూబెన్
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా
సంగీతం: ఏఆర్ రహమాన్
నిర్మాత : కొట్టపాడి జె. రాజేష్
రచన, దర్శకత్వం : ఆర్. రవికుమార్
ఓటీటీ : సన్ నెక్స్ట్
హీరో శివకార్తికేయన్ సినిమాలు తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఏలియన్ తో శివకార్తికేయన్ చేసిన సందడి ఏంటో చూసేద్దాం..
కథ :
తమిళనాడులోని ఓ ప్రాంతంలో మందులు, యూరియా వాడకుండా సేంద్రియ పద్దతిలో వ్యవసాయం చేస్తుంటాడు తావిజ్(శివ కార్తికేయన్). దాంతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా వస్తాయి. ఆశించిన దిగుబడి రాకపోగ అప్పులు పెరిగిపోవడంతో తావిజ్ వాళ్ళ అమ్మ అతడిని సిటీకి పంపిస్తుంది. సైంటిస్ట్ ఆర్యన్ ( శరద్ ఖేల్కర్ ) భూమిని తవ్వి నోవా గ్యాస్ ని కనిపెట్టే ప్రయత్నంలో ఉంటాడు. స్పార్క్ అనే గ్రహశకలాన్ని ఉపయోగించి సైంటిస్ట్ ఆర్యన్ ప్రయోగాలు చేస్తుంటాడు. అయితే అతను ఆఫ్రికాలో చేసిన ప్రయోగం ఫెయిల్ అవ్వడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ఇక ఇండియాకి వచ్చిన ఆర్యన్ చెన్నై లోని ఓ ప్రాంతంలో సీక్రెట్ గా తన ప్రయోగాలు చేస్తుంటాడు. అదే సమయంలో అతడి దగ్గర ఉన్న స్పార్క్ కోసం ఏలియన్ భూమి మీదకి వస్తుంది. మరి ఆ ఏలియన్ , తావిజ్ లు ఎలా కలుసుకున్నారు? ఆర్యన్ ప్రయోగం ఫలించిందా? లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
బాలివుడ్ లో వచ్చిన 'కోయి మిల్ గయా' సినిమాలో ఏలియన్ వచ్చే సీన్స్ ని పెద్దలతో పాటు పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇందులోను దర్శకుడు ఆర్. రవికుమార్ సేమ్ అదే రిపీట్ చేశాడా అనిపిస్తుంది. అయలాన్ వచ్చిన ప్రతీసారీ విజువల్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రథమార్ధంలో వచ్చే విజువల్స్ పిల్లలతో పాటు అందరిని ఆకట్టుకుంటాయి.
అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఏలియన్ డిజైన్ బాగుంది. స్పెషల్ కేర్ తీసుకొని చేసినట్టుగా తెలుస్తుంది. హీరోగా ఈ సినిమాకి శివకార్తికేయన్ తప్ప ఇంకెవరు సూట్ అవ్వరు అనేంతలా చేశాడు. హీరోయిన్ మీద ఫ్లవర్స్ షాట్, అయలాన్ డ్యాన్స్ చేసే సీన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా విజువల్స్ పరంగా కామెడీ పరంగా బాగున్నప్పటికి కథ పెద్ద మైనస్. చాలా సింపుల్ గా ఉంటుంది. ప్రతీది ముందే ఊహించేయొచ్చు.
ద్వితీయార్థంలో హీరోకి, అయలాన్ మధ్య ఇంకొన్ని సీన్స్ ఉంటే బాగుండేది. క్లైమాక్స్ వచ్చే సీన్స్ లో లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అది విఎఫ్ఎక్స్ అని తెలిసిపోతుంది. ఇక్కడ గ్రాఫిక్స్ కొద్దిగా దెబ్బతిన్నాయి. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అవసరం లేదనిపిస్తుంది. ప్రథమార్ధంలో వచ్చే స్లో సీన్స్.. స్టోరీ ముందే చెప్పేసేలా ఉండటమే ఈ సినిమాకి మైనస్. అయితే కిడ్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.
ఏఆర్ రహమాన్ సంగీతం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. టైటిల్స్ మొదలైనప్పుడు, అయలాన్ వెళ్ళిపోతున్నప్పుడు వచ్చే బిజిఎమ్ హాలివుడ్ లెవెల్ లో ఉంది. సినిమాటోగ్రఫీ అదనపు బలంగా నిలిచింది. ఏనుగులని కాపాడే సీన్ లో నేచర్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు నీరవ్ షా. ఎడిటింగ్ బాగుంది. రూబెన్ ఆ విఎప్ఎక్స్ సీన్స్ లో కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
తామిజ్ పాత్రలో శివకార్తికేయన్ ఒదిగిపోయాడు. టట్టూనే సెకెండ్ హీరో.. అంతగా ఆకట్టున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, యోగిబాబు, కరుణాకరన్ వారి పాత్రలకి న్యాయం చేశారు. మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
ఫైనల్ గా :
అడల్ట్ సీన్స్ ఏమీ లేకపోవడం.. లిప్ లాక్ లు లేకపోవడం. అన్నీ కలిసి ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూసేలా చేసాయి. ఎలియన్ వచ్చినప్పుడల్లా పిల్లలు భళే ఎంజాయ్ చేస్తారు .
రేటింగ్ : 2.75/5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |