![]() |
![]() |
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ గురించి అందరికీ తెలిసిందే. తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా వరసగా సినిమాలు నిర్మిస్తూ పరిశ్రమలోని ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఆయన తాజాగా నిర్మించిన సినిమా ‘ఈగిల్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడిన మాటల్లో తమ సంస్థ నుంచి రాబోతున్న సినిమాల గురించి, ప్లానింగ్‌లో ఉన్న సినిమాల గురించి ప్రస్తావించారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అవినీతి గురించి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అవినీతి ఉన్నట్టే ఇండస్ట్రీలో కూడా అవినీతి ఉందని, చిన్న స్థాయిలో జరిగే కరప్షన్ వల్ల సినిమాపై పెద్ద స్థాయిలో ప్రభావం చూపుతుందన్నారు.
దానికి ఉదాహరణగా ఓ అంశాన్ని తెలియజేశారు. ‘ఈ కరప్షన్‌లో మూడు లెవల్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రైస్ కరప్షన్ ఉంటుంది. అది 10 నుంచి 30 శాతం వరకు ఉంటుంది. రెండోది క్వాంటిటీ. దీనికి ఓ ఉదాహరణ చెబుతాను. కేరవ్యాన్ విషయమే తీసుకుంటే దానిమీద కరప్షన్ 500 రూపాయలు. ఇన్‌ఫర్మేషన్ ఇచ్చేవాడికి 180 రూపాయలు, అప్రూవ్ చేసిన వాడికి 320 రూపాయలు. ఒక వెహికిల్ మీద 500 రూపాయలు ఓకే అనుకోవచ్చు. సెకండ్ లెవల్ క్వాంటిటీ. 6 వెహికిల్స్ ఉంటే 10 వెహికిల్స్ అని రాస్తారు. ఈ విషయంలో వెండర్‌కి లోకువ అయిపోతాం. థర్డ్ లెవల్ క్వాలిటీ. ఆల్‌రెడీ తమ వల్ల వారికి ఎమౌంట్ వస్తుంది కాబట్టి తక్కువ క్వాలిటీ వెహికిల్స్ పంపిస్తాడు. దాని వల్ల ఆర్టిస్టులు అప్‌సెట్ అవుతారు. దాని ఫలితం వారు చేసే షాట్ మీద పడుతుంది. అలా చూసుకుంటూ వెళితే అది సినిమా మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. నేను చెప్పినవి నిజమైన విషయాలే’ అని వివరించారు.
తాను చేసిన ఈ కామెంట్స్ వల్ల ఇండస్ట్రీలోని కొందరు హర్ట్ అయ్యారని, సినీ కార్మికుల గురంచి తప్పుగా మాట్లాడానని చిత్రీకరించారనే విషయం తన దగ్గరకు వచ్చిందన్నారు విశ్వప్రసాద్. అందుకే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు విశ్వప్రసాద్.
ట్విట్టర్ ద్వారా విశ్వప్రసాద్ స్పందిస్తూ ‘ఈగిల్ సినిమా ప్రచారంలో భాగంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా.. నా ప్రొడక్షన్ హౌస్‌లో జరిగిన అవినీతి చర్యల వల్ల సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటుందనే విషయాన్ని చెప్పాను. ఆ అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి పతిచర్యలు చేపట్టాను అనేది చెప్పాను. దీనికి భుజాలు తడుముకున్న కొందరు పరిశ్రమ వ్యక్తులు నా ా్యఖ్యలను వక్రీకరించారట. నేనేదో కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచినట్టు దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారట. ఆ విషయాలన్నీ నా దృష్టికి వచ్చాయి. పరిశ్రమలోని కొందరు వ్యక్తుల అవినీతి వల్ల, కష్టపడి పనిచేసే యూనియన్ కార్మికులకే నా డబ్బు అందడం లేదని నేను అన్నాను. నా కంపెనీ అంతర్గత వ్యవహారం గురించి నేను చేసిన వ్యాఖ్యలతో బయటి వారికి సంబంధమేమిటో నాకు అర్థం కాలేదు. నా సంస్థలో ఎవరికైనా జీతాలందకపోతే, వారే నేరుగా మాట్లాడి తీసుకుంటారు. యూనియన్‌కి కంప్లయింట్ వెళ్తే ఛాంబర్‌లో లేదా కౌన్సిల్‌లో సాల్వ్ చేసుకుంటాము. ఇష్టపడి సినిమా వ్యాపారంలోకి వచ్చాను. ఇంకొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కంపెనీలో అవినీతికి పాల్పడని వారంతా గర్వంగా పనిచేయవచ్చు. అవినీతి పరులపై నేను లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ, నేను వారి కుటుంబాల గురించి ఆలోచించి వదిలేశాను. అది నా స్వంత నిర్ణయం. బయటి వారికి సంబంధం లేదు. నేను తీసిన ముప్ఫైకి పైగా సినిమాల్లో మూడు లక్షలకు పైగా కార్మిక సోదరుల కష్టం ఉంది. మరో పాతిక సినిమాలు సెట్ మీదకొస్తున్నాయి. నేను యూనియన్ వర్కర్స్‌కి వ్యతిరేకం కాదు. వాళ్ల కష్టాన్ని, తన ధనాన్ని కలిపి దోచుకుంటున్న వారికి మాత్రమే వ్యతిరేకిని’ అని క్లారిటీగా చెప్పారు టి.జి.విశ్వప్రసాద్.
![]() |
![]() |