.WEBP)
‘నేనొక్కసారి చెప్తే.. వందసార్లు చెప్పినట్టే’.. సూపర్‌స్టార్ రజినీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ విననివారు, తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ‘బాషా’ చిత్రంలోని ఈ డైలాగ్ తెలుగులో ఎంతో పాపులర్ అయింది. తమిళ్‌లో ఈ డైలాగ్ రజినీకాంత్‌కి ఎంత పేరు తెచ్చిందో తెలీదుగానీ, తెలుగులో ఈ డైలాగ్ చెప్పిన సాయికుమార్‌కి రజినీకాంత్‌కి వచ్చినంత పేరు వచ్చింది. ‘బాషా’ తెలుగు వెర్షన్‌కి సాయికుమార్ వాయిస్ అంత ప్లస్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత వచ్చిన ‘పోలీస్ స్టోరీ’తో సాయికుమార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఇతర హీరోలకు డబ్బింగ్ చెప్పడం ఆపేశాడు. 1999లో వచ్చిన ‘నరసింహ’ చిత్రంతో మనో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి నిన్నటి ‘జైలర్’ వరకు మనో వాయిస్‌తోనే రజినీకాంత్ సినిమాలు తెలుగు వెర్షన్‌లో రిలీజ్ అవుతున్నాయి. ఒక విధంగా రజినీకాంత్‌కి మనో వాయిస్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అయింది. ప్రేక్షకులు కూడా ఆ వాయిస్‌కే అలవాటు పడిపోయారు.
తాజాగా రజినీకాంత్ సినిమా ‘లాల్ సలామ్’ ట్రైలర్ రిలీజ్ అయింది. అందులో సాయికుమార్ వాయిస్ మళ్ళీ వినిపించేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒకప్పుడు అదే వాయిస్‌ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఇప్పుడది చాలా కొత్తగా అనిపించడంతో అలవాటు పడలేకపోతున్నారు. పైగా అప్పట్లో రజినీకాంత్‌కి చెప్పిన వాయిస్‌కి ‘లాల్ సలామ్’లో వినిపిస్తున్న వాయిస్‌కి పూర్తిగా డిఫరెన్స్ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి, రజినీకాంత్ పాత్రకు తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. ట్రైలర్ చూసిన వారంతా సాయికుమార్ వాయిసే సినిమాకి మైనస్ అయ్యేలా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.