![]() |
![]() |
సినిమా ఇండస్ట్రీలో రాణించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ ప్రయత్నంలో అనుకోకుండా జరిగే కొన్ని పరిణామాల వల్ల నష్టపోతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే.. వారిని ప్రలోభ పెట్టి ఎన్నో రకాలుగా వారిని వాడుకోవాలని చూసే వాళ్ళూ ఉంటారు. అలాంటి ఓ ఘటన టాలీవుడ్ హీరోయిన్ విషయంలో జరిగింది. రాజ్ తరుణ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తిరగబడరా సామి’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న మాల్వీ మల్హోత్రా ఓ బాలీవుడ్ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసింది. ‘తిరగబడరా సామి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత విక్రమ్‌భట్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
‘ఉడాన్’ అనే టీవీ సీరియల్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్న మాల్వి ఆ తర్వాత ‘హోటల్ మిలన్’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అభ్యూహం’ అనే మలయాళీ చిత్రంలో కూడా నటించింది. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆమెకు ఎదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకుంది మాల్వీ. బాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్‌గా ఉన్న విక్రమ్ భట్ కుమార్తె కృష్ణ భట్ చేసిన ఓ మ్యూజిక్ వీడియోలో మాల్వీ నటించింది. ఈ వీడియోకి సంబంధించిన షూటింగ్ పూర్తయిన తర్వాత మాల్వీకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ విషయంలో విక్రమ్‌భట్‌గానీ, ఆమె కుమార్తె కృష్ణభట్‌గానీ పెదవి విప్పలేదట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయిందట. చివరికి ఈ వీడియో విషయంలో తాను మోసపోయానని గ్రహించింది. తనలా మరొకరు మోసపోకూడదని, రెమ్యునరేషన్ విషయంలో ముందు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఘటన గురించి చెప్పానంటోంది మాల్వీ.
![]() |
![]() |