![]() |
![]() |

'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా గతేడాది నవంబరు 17న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇటీవల ఓటీటీలో విడుదలై అక్కడా విశేష ఆదరణ పొందుతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రతిష్ఠాత్మక జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నాలుగు అవార్డులని గెలుచుకుంది. ఉత్తమ నటిగా పాయల్ రాజపుత్, ఉత్తమ సౌండ్ డిజైనర్ గా రాజా కృష్ణన్, ఉత్తమ ఎడిటర్ గా గుళ్ళపల్లి మాధవ్ కుమార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా ముదసర్ మొహమ్మద్ అవార్డులను గెలుపొందారు.
కథాకథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా 'మంగళవారం' ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకోగా, ఇప్పుడు జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నాలుగు అవార్డుల గెలుపొందడంతో దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు.
ముద్రమీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నందిత శ్వేత, అజయ్ ఘోష్, అజ్మల్, లక్ష్మణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ గా మోహన్ తాళ్లూరి వ్యవహరించారు.
![]() |
![]() |