![]() |
![]() |
ఒకప్పుడు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అంతగా ఉండేది కాదు. రాను రాను ఓవర్సీస్‌లోనూ తమ ఉనికిని చాటుకునే అవకాశం టాలీవుడ్ టాప్ హీరోలకు దక్కింది. ఈమధ్యకాలంలో అది మరింత పెరిగింది. కాంబినేషన్ ఏదైనా కంటెంట్ బాగుంటే ఓవర్సీస్‌లో మంచి ఫిగర్స్ కనిపిస్తున్నాయి. రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి, బాహుబలి2, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలు ఓవర్సీస్‌లో దాదాపు 20 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేశాయి. ఇటీవల విడుదలైన సలార్ విషయానికి వస్తే తెలుగు వెర్షన్ 5 మిలియన్ కలెక్ట్ చేయగా, అన్ని వెర్షన్స్ కలిపి 8 మిలియన్ వసూలు చేసి నాన్ రాజమౌళి రికార్డులను క్రియేట్ చేసింది.
తాజాగా విడుదలైన హనుమాన్ పాత రికార్డులను అధిగమించి కొత్త నాన్ రాజమౌళి రికార్డులను క్రియేట్ చేసేలా ఉంది. కేవలం నాలుగు రోజుల్లోనే 3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడమే దానికి నిదర్శనంగా కనిపిస్తోంది. రంగస్థలం, అల వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్స్ ఫుల్ రన్‌లో 3.5 మిలియన్ మార్క్‌ను చేరుకున్నాయి. రాజమౌళి, ప్రభాస్ సినిమాలే అక్కడ టాప్ పొజిషన్‌లో ఉన్నాయి. ఏ తెలుగు సినిమా కూడా ఆ రేంజ్‌కి వెళ్ళలేకపోయింది. ఒకప్పుడు ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయంగా ఉండేది. ఇక లాంగ్ రన్‌లో మూడు మిలియన్లు దాటి కలెక్ట్ చేయడం అంటే అది చాలా రేర్. అలాంటిది ఇప్పుడు హనుమాన్ నాలుగు రోజుల్లోనే మూడు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిందంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్ లిస్ట్‌లో హనుమాన్ నిలవడం సినీవర్గాలకు, ట్రేడ్‌వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన టాప్ హీరోల సినిమాలను భారీ సినిమాలు అనీ, హనుమాన్‌ను చిన్న సినిమా అనీ విభజిస్తున్నారు. కానీ, ఇప్పుడు హనుమాన్ చిత్రానికి కనిపిస్తున్న ఫిగర్స్ చూస్తుంటే హనుమాన్‌ను చిన్న సినిమా అనే ధైర్యం ఎవ్వరూ చెయ్యకపోవచ్చు. అంతే కాదు, ప్రశాంత్‌వర్మ గతంలో కొన్ని ఏవరేజ్ సినిమాలు తీసి చిన్న డైరెక్టర్‌గానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హనుమాన్‌తో ఒక్కసారిగా పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయాడు.
హనుమాన్ చిత్రం కలెక్షన్లపరంగా ఆర్‌ఆర్‌ఆర్, బాహుబలి, బాహుబలి 2 రికార్డులను అధిగమించకపోవచ్చు. కానీ, కొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసి ఇప్పటికే తన సత్తాను చూపిస్తోంది. ఇప్పటివరకు నాన్ రాజమౌళి రికార్డులు అని చెప్పుకుంటున్నారు. ఇకపై నాన్ హనుమాన్ రికార్డులు అనే ఒక కొత్త ట్రెండ్‌ను ఓవర్సీస్‌లో క్రియేట్ చేసేందుకు హనుమాన్ సిద్ధమవుతోంది. ఇక హనుమాన్ లాంగ్ రన్ విషయానికి వస్తే.. 5 నుంచి 8 మిలియన్ డాలర్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్‌వర్గాలు.
ఈ లెక్కలు చూస్తుంటే హనుమాన్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంత ఓన్ చేసుకున్నారో అర్థమవుతుంది. ప్రతిచోటా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకి థియేటర్ల లేమి కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు నుంచే ఈ సమస్య ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయి సూపర్‌హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమాకి థియేటర్లు దొరకడం లేదు. గుంటూరు కారం చిత్రానికి పాజిటివ్ టాక్ లేకపోయినా, థియేటర్లకు జనం రాకపోయినా రన్ చేస్తున్నారు తప్ప సినిమాను తియ్యడం లేదు. రన్ ఎక్కువగా లేని థియేటర్ల నుంచి గుంటూరు కారం చిత్రాన్ని తప్పిస్తే హనుమాన్‌కి థియేటర్లు దొరికే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. థియేటర్లు పెరిగితే మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూడాలన్న ఉత్సాహం వారిలో కనిపిస్తోంది.
![]() |
![]() |