![]() |
![]() |
తమ అభిమాన హీరోకి ఏదైనా జరిగితే అభిమానులు తట్టుకోలేరు, తన అభిమానులకు ఏదైనా జరిగితే ఆ హీరో భరించలేడు. సినిమా తారలు, అభిమానుల మధ్య ఉండే అనుబంధం చాలా గొప్పది. గతంలో కంటే ఈమధ్యకాలంలో హీరోలు, అభిమానుల మధ్య సంబంధాలు ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నాయి. హీరోలు తమ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ తమ సినిమాలకు సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అంశాలను కూడా వారితో షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ అభిమానులకు ఏదైనా జరిగితే హీరోలు తట్టుకోలేరు. ఎంతో ఎమోషనల్ అయిపోతారు. తమ వల్ల అభిమానులు, వారి కుటుంబాలు నష్టపోయాయని బాధపడతారు.
తాజాగా కన్నడ స్టార్ హీరో యశ్ విషయంలో అదే జరిగింది. జనవరి 8 యశ్ పుట్టినరోజు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని భావించిన అభిమానులు భారీ ఏర్పాటు చెయ్యాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని గదగ్ జిల్లా సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న యశ్ ఎంతో చలించిపోయారు. అదే రోజు సాయంత్రం సురంగి వెళ్లి అభిమానుల కుటుంబాలను పరామర్శించారు. ఎంతో ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించేందుకే తన పుట్టినరోజును సింపుల్‌గా చేసుకోవాలని అనుకున్నట్టు తెలిపారు. తన పుట్టినరోజున ముగ్గురు అభిమానుల్ని కోల్పోవడం ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. చేతికి అంది వచ్చిన కొడుకులు దూరమైతే తల్లిదండ్రులకు ఎంత ఆవేదన ఉంటుందో తనకు తెలుసన్నారు. ఆ తల్లిదండ్రులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా వారి పిల్లలు తిరిగి రారని, అందుకే ఆ కుటుంబాలకు తాను అండగా ఉంటానని అన్నారు. వారి కుమారుల స్థానంలో తాను ఉంటానని, కుటుంబాల బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఫ్యాన్స్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, తన మీద అభిమానంతో ఏదైనా చేసే ముందు వారి కుటుంబం గురించి ఆలోచించాలని చేతులు జోడిరచి ప్రార్థించారు యశ్. గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, పుట్టినరోజు జరుపుకోవాలంటే ఎంతో భయంగా ఉందన్నారు.
ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు అభిమానులు జిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సురంగి గ్రామం నుంచి నేరుగా జిమ్స్ ఆస్పత్రికి వెళ్ళిన యశ్ చికిత్స పొందుతున్న అభిమానుల్ని పరామర్శించారు. వారి కుటుంబాలకు సాయం చేస్తానని చెప్పడమే కాకుండా, చికిత్సకు అవసరమైన డబ్బును కూడా యశ్ చెల్లించారని తెలుస్తోంది. అభిమానులు కోలుకున్న తర్వాత తనని పర్సనల్‌గా కలవాలని వారికి సూచించారట.
![]() |
![]() |