![]() |
![]() |
డిసెంబర్ 22న విడుదలవుతున్న ప్రభాస్ కొత్త సినిమా ‘సలార్’ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. అందరి కంటే తమ అభిమాన హీరో సినిమా చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అలాగే యంగ్ హీరో నిఖిల్ కూడా ముందుగా సినిమా చూసెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకే అర్థరాత్రి ఒంటిగంటకు వేసే స్పెషల్ షో చూసేందుకు రెడీ అయ్యాడు. నిఖిల్ కూడా వీరాభిమాని కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే తానొక్కడే కాకుండా తనతోపాటు 100 మంది ప్రభాస్ అభిమానులకు ఉచితంగా స్పెషల్ షో టిక్కెట్స్ అందిస్తానని సోషల్ మీడియాలో ప్రకటించాడు.
సినిమా విడుదల రోజు స్పెషల్ షోకు, టిక్కెట్ల రేట్స్ పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ దానికి వేదికగా నిలిచింది. అర్థరాత్రి ఒంటిగంటకు ఈ స్పెషల్ షో ఉంటుంది. సాధారణం స్పెషల్ షో టికెట్ ధర వేలల్లో ఉంటుంది. అలాంటి టికెట్స్ 100 ఇస్తానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు నిఖిల్. ‘10 ఏళ్ల క్రితం ఇదే థియేటర్‌లో ‘మిర్చి’ సినిమా ఒంటిగంట స్పెషల్ షో చూశాను. మళ్లీ చరిత్రను తిరగరాద్దాం’ అని నిఖిల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
నిఖిల్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రభాస్ అభిమాని ఉన్నాడు. 2013లో మిర్చి సినిమా స్పెషల్ షో చూస్తున్నట్టు నిఖిల్ పెట్టిన ట్వీట్‌ను బయటికి తీసి పోస్ట్ చేశాడు. ‘అర్ధరాత్రి ఒంటిగంట షో తానెప్పుడూ చూడలేదు. ప్రభాస్ ఫ్యాన్స్‌తో కలిసి ప్రభాస్ మూవీని చూడడం తనకొక కొత్త అనుభూతి’ అని 2013లో ‘మిర్చి’ సినిమాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి ప్రభాస్ అభిమాని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘సలార్ అర్ధరాత్రి ఒంటిగంటకి సో ఉందట. నీ పలుకుబడి వాడి నువ్వు ఒక టికెట్ తీసుకొని నాకు ఒకటి ఇప్పిస్తే నీ పేరు మీద గుడిలో అర్చన చేయిస్తా నిఖిల్ అన్న’ అని పోస్ట్ చేశాడు. దీనికి నిఖిల్ ‘శ్రీరాములు థియేటర్ 1 ఎఎం షో ఫిక్స్’ అని రిప్లై ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఒక్కడికే టిక్కెట్ ఇస్తే ఎలా అనుకున్నాడో ఏమో.. ఏకంగా 100 మంది ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా చూసేలా ఏర్పాటు చేస్తున్నాడు.
![]() |
![]() |