![]() |
![]() |

మూవీ : ది ఆర్చీస్
నటీనటులు: అగస్త్య నంద, ఖుషీ కపూర్, వేదంగ్ రైనా, అదితి సైగల్, సుహానా ఖాన్, మిహర్ అహుజా తదితరులు
ఎడిటింగ్: నితిన్ బైద్
సినిమాటోగ్రఫీ: నికోస్ అండ్రిట్ సకిస్
మ్యూజిక్ : శంకర్ ఎ హెషాన్ లాయ్
దర్శకత్వం: జోయా అక్తర్
కథ, స్క్రీన్ ప్లే : అయేషా దేవిత్రి థిల్లాన్
డైలాగ్స్: ఫర్హాన్ అక్తర్
నిర్మాతలు : జోయా అక్తర్, రీమా కంగ్టి, షరాద్ దేవరాజన్
ఓటిటి : నెట్ ఫ్లిక్స్
కొత్త కథని ప్రతీ ఒక్క ప్రేక్షకుడు అభిమానిస్తాడు. ప్రకృతిని మనిషికి లింక్ చేస్తూ తీసిన సినిమాలు తక్కువ. అలాంటి సినిమాల జాబితాలోకి మరో సినిమా వచ్చింది. అదే ' ది ఆర్చిస్' . నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం...
కథ:
ఒక కొండప్రాంతంలో కొంతమంది నివాసం ఉంటారు. వాళ్ళంతా ఇండో ఆంగ్లేయన్స్. అంటే బ్రిటిష్ పాలనలో కొందరు ఆంగ్లేయులు ఇక్కడి వారిని పెళ్ళి చేసుకొని ఇక్కడే నివాసగృహాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఇలా ఇండో ఆంగ్లేయన్స్ రివర్ డేల్ అనే ప్రాంతంలో నివసిస్తుంటారు. అక్కడ పుట్టిన పిల్లలు అయిదు సంవత్సరాల వయసు నిండిన తర్వాత వారిచేత ఒక మొక్కని నాటిస్తారు. అలా ఒక్కోక్క మొక్కని నాటుతూ ఒక పెద్ద గ్రీనరీ పార్క్ అవుతుంది. కొన్ని సంవత్సరాలకి అదంతా టూరిస్ట్ స్థలంగా మారుతుంది. దీంతో అక్కడ ఒక టూరిస్ట్ రెసార్ట్, కానీ హోటల్ కానీ కడితే లాభం పొందవచ్చని కొందరు భావిస్తుంటారు. అదే సమయంలో అక్కడ ఉన్న యువకుడు ఆర్చిస్ (అగస్త్య నంద) సంగీతం నేర్చుకోడానికి ఇంగ్లాండ్ కి వెళ్ళాలనుకుంటాడు. కానీ అక్కడి చెట్లని నరికేసి హోటల్ కడుతున్నారని తెలుసుకున్న ఆర్చిస్(అగస్త్య నంద) ఇంగ్లాండ్ కి వెళ్ళకుండా ఆగి తన స్నేహితులు ఖుషీ, అదితి, సుహానాలతో కలిసి ఎదురుతిరుగుతాడు. మరి రివర్ డేల్ లోని ప్రకృతిని ఆర్చిస్ కాపాడుకోగలిగాడా? ఆర్చిస్ కి ఎదురైన సమస్యేంటో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
సినితారల వారసులు చేసే సినిమాల మీద ఎప్పుడు ఒక హైప్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్, శ్రీదేవి తనయ ఖుషీ కపూర్, మ్యూజిషియన్ అమిత్ సైగల్ కుమర్తే అది సైగల్ , ప్రతాప్ శర్మ కుమార్తే తారా శర్మ.. ఇలా అందరు ఈ సినిమాలో ఉండటంతో కథపై మరింత ఆసక్తి పెరిగింది.
రివర్ డేల్, అక్కడి గ్రీన్ పార్క్, అక్కడ ఉండే ఇండో ఆంగ్లేయన్స్ చుట్టూ కథ నడుస్తుంటుంది. ఇందులో ఆర్చిస్ చెట్లని కాపాడాలని ప్రయత్నిస్తుంటాడు. వెరోనిక తండ్రి హిరమ్ లోడ్జ్ (అల్యా ఖాన్) అక్కడ ఒక హోటల్ కట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఇది ఇలా సాగుతుండగా వెరోనికా, బెట్టీ, ఆర్చిస్ ల ముక్కోణపు ప్రేమ కథ జరుగుతుంటుంది.
జోయా అక్తర్ కథని ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఇది సినిమాగా కాకుండా ఒక డాక్యుమెంటరీగా తీస్తే బాగుండేదనిపించింది. కొన్ని సాగదీత అంశాలు ఉన్నాయి. ప్రతీసారీ హీరోది పైచేయి అవ్వడం, విలన్ ని మరీ బుర్రలేని వాడిగా చూపించడం కాస్త ప్రేక్షకుడికి ఇబ్బంది అనిపించేవిగా అనిపిస్తుంటాయి. ఎంచుకున్న కథాంశానికి తీసిన విధానానికి ఎక్కడ సంబంధం లేదు. ఈ కథతో ప్రేక్షకుడు క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టడం కష్టమే. కానీ మూవీ చివరలో ప్రకృతి గురించి ఆర్చీస్ చెప్పే సీన్ అందరికి నచ్చేస్తుంది.
కొన్ని చోట్ల లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. వాటి మినహాయిస్తే ఫ్యామిలీతో చూడొచ్చు. క్యారెక్టర్స్ కొత్తవి ఎక్కువగా ఉంటడం, వారి పేర్లని గుర్తుంచుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రథమార్ధం కాస్త ఎంగేజింగ్ గా అనిపించినా.. ఇంటర్వెల్ కి పూర్తి సినిమా అర్థమవుతుంది. ఇక క్లైమాక్స్ కి ముందు కొన్ని చోట్ల అర్థవంతమైన పోలికలు ఉండటం అవి ప్రేక్షకుడికి అంతగా కన్విన్సింగ్ గా అనిపించదు. ఇక సినిమా ఓవరాల్ గా ఓసారి చూసేయొచ్చు అనేంతలా తీసారు డైరెక్టర్ జోయా అక్తర్. శంకర్ ఎ హెషాన్ బిజిఎమ్ బాగుంది. నికోస్ అండ్రిట్ సకిస్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నితిన్ బైద్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలవలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు :
ఆర్చిస్ పాత్రలో అగస్త్య ఒదిగిపోయాడు. ప్రకృతి ప్రేమికుడిగా చాలా సహజంగా నటించాడు. బెట్టీ కపూర్ పాత్రలో ఖుషీ కపూర్ ఆకట్టుకుంది. వెరోనిక రొన్నె గా సుహానా ఖాన్ పర్వాలేదనపించింది. ఇక మిగిలివ వాళ్ళు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ప్రకృతికి మనిషిని దూరం చేయకూడదంటూ చూపించిన ఈ సినిమా మంచి సందేశాన్ని ఇచ్చింది. ఒకసారి ట్రై చేయిచ్చు అంతే.
రేటింగ్ : 2 / 5
✍🏻. దాసరి మల్లేశ్
![]() |
![]() |